మంగళగౌరి వ్రతం కుజుని శాంతింపచేయడంకోసం
మంగళగౌరి వ్రతం మాంగల్యబలం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతంలో మంగళగౌరి దేవిని ఆరాధిస్తారు. ఈ వ్రతం వెనుక మరొక బలమైన కారణం కూడా ఉంది. మంగళవారానికి అధిపతి అయిన మంగళుడు అంటే కుజుని శాంతింప చేయడంకోసం కూడా మంగళగౌరి వ్రతం ఉద్దేశింపబడింది. మంగళగౌరి వ్రతంలో మనం గౌరి మాతను పూజిస్తాం. గౌరిని పూజించడం వల్ల కుజుని ద్వారా సక్రమించే బాధలు ఉపశమింపబడతాయి. ఎందుకంటే... భూమి పుత్రుడైన కుజుడు మంగళగౌరీ దేవి అనుగ్రహంతోనే మంగళవారానికి అధిపతి అయ్యాడని చెబుతారు.
కుజుడు స్ఫర్ధలకు కారకుడు, కుజుని కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అమ్మాయికి కుజుని పరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని, కుటుంబంలో స్పర్థలు ప్రవేశించకూడదనే సంకల్పమే ఈ వ్రతం చేసుకోవడంలో ఉన్న మరొక ముఖ్యోద్దేశం. కుజదోషం ఉన్న మహిళలచే తప్పనిసరిగా ఈ వ్రతం చేయించాలని పెద్దలు చెబుతారు. కుజదోషం ఉన్నవారు, లేని వారు కూడా ఈ వ్రతం చేసి తీరాలన్నది ఒక నియమం. దోషం ఉంటే దోష ప్రభావం తగ్గుతుంది. లేనివారు దోషప్రభావానికి గురికారు.