మంగళగౌరి వ్రతంలో కాటుక ప్రాధాన్యత ఏమిటి?

మంగళగౌరి దేవి అలంకార ప్రియురాలు. అమ్మకు సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. అమ్మవారు 44 రకాల సుగంధ ద్రవ్యాలను, 44 రకాల ఆభరణాలను నిత్యం ధరించి ఉంటుందని పురాణ కథనాల ద్వరా మనకు తెలుస్తోంది. అమ్మవారి వ్రతంలో 44 రకాల సుగంధ ద్రవ్యాలు కూడా వినియోగించాలనేది కూడా ఒక నియమం అంటారు పెద్దలు. అయితే వాటన్నింటిలో అతి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు పసుపు, కుంకుమ, గంధం, కాటుక. ప్రతి మహిళ సౌభాగ్యం కోసం ఈ నాలుగింటినీ వినియోగిస్తుంది. వాటినే మహిళలు ప్రధానంగా అమ్మవారి పూజలో వినియోగిస్తారు.

కాటుక ఆడవారిలో దాగి ఉన్న అందాన్ని వెలికి తీస్తుంది. అప్పటి వరకూ కాటుకలేని కళ్లతో ఉన్న ఆడవాళ్లను కాటుక అలంకరించుకున్నాక చూస్తే వారి రూపురేఖలు మారిపోతాయి. ఆడవారిలో అంతర్గతంగా దాగిఉన్న అందాన్ని కాటుక ఏవిధంగా బైటికి తెస్తుందో, దానికి ధరించిన వారి కంటికి బాహ్య ప్రపంచంలో కనిపించే దార్మిక అంశాలు కంటికి కనిపిస్తాయి అంటారు. అంటే మంచి చెడుల వ్యత్యాసం తెలుస్తుందన్నమాట.

మరొక అంశం ఏమిటంటే మంగళగౌరి వ్రతకథలో వ్రతం ఆచరించిన సుశీల అల్పాయుష్కుడైన తన భర్తను సంపూర్ణ ఆయుష్కునిగా చేసుకోగలగడమే కాకుండా, వ్రతంలో భాగంగా తయారు చేసుకున్న కాటుక ద్వారా తన అత్తమామల కంటిచూపును కూడా మంగళగౌరి అనుగ్రహంతో తిరిగి తేగలుగుతుంది. అందుకే ఈ వ్రతంలో కాటుక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్రతం చేసిన మహిళలు తాము ఇచ్చే వాయనంతోపాటుగా కాటుకను కూడా ముత్తెదువలకు పంచుతారు. ముత్తయిదువులు  కూడా ఈ కాటుకను ధరించడం వల్ల అమ్మ అనుగ్రహం పొందుతారు.

కాటుక తయారు చేసుకోవాలిలా...


మంగళగౌరి వ్రతంలో అమ్మవారి పూజలో కాటుకను స్వయంగా తయారు చేసుకోవాలి. ఆవునెయ్యి దీపంపై ఇత్తడి గరిటెను బోర్లించి, దానికి పట్టిన స్వచ్ఛమైన నల్లని పదార్ధంలో కాస్త ఆవునెయ్యి కలిపి కాటుకను తయారు చేసుకోవాలి. దానినే ముత్తయిదువలకు వాయినాలతో పాటు అందచేయాలి. పూర్వకాలం ఈ విధంగానే కాటుకను తయారు చేసేవారు మన పెద్దలు. ఆవునెయ్యిలోని ఔషధగుణాల కలయికతో ఈ కాటుక కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతే కానీ మార్కెట్లో కొన్న కాటుకడబ్బాలు మాత్రం వాయనంలో ఇవ్వకూడదు.