వరలక్ష్మీవ్రత నియమాలు
- వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలను పసుపు కుంకుమలు అద్ది, వరిపిండితో ముగ్గులు వేయాలి. ఎందుకంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటివంక చూస్తుందంటారు పెద్దలు.
- వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. మామిడి తోరణాలు దేవతలను ఆకర్షిస్తాయంటారు. వీటిని ఇంటి ముందు కట్టడం వల్ల పూజకు అనుకూల వాతావరణం మన ఇంట్లో ఏర్పడుతుంది.
- పూజా సామాగ్రిని సిద్ధం చేసుకున్నాక లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున ప్రతిష్టించి పూజించాలి. లక్ష్మిదేవిని ఈ శాన్యంలో ఉంచి పూజిస్తే శుభకరమని చెబుతారు.
- ఇంటి ఈశాన్యభాగంలో శుభ్రంచేసి వరిపిండితో అష్టదళపద్మం వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు, కుంకుమలతో అలంకరించిన పీటని ఉంచాలి. ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి. ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి.... దాని మీద కలశాన్ని ప్రతిష్టించాలి.
- కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపుముద్దలు కానీ, పసుపుకొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఎందుకంటే రాజలాంఛనాలకు, వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ వుంటే అక్కడ సర్వసంపదలు వుంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి ‘గజలక్ష్మి. ఈమె
సకల ఐశ్వర్యాలకు ప్రతీక. - కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది, దాని మీద కొబ్బరికాయను నిలపాలి. ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయంతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను ఉంచడమూ శుభసూచకమే!
- అమ్మవారిని అష్టోత్తరశతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంధిపూజ చేయాలి. ఇందుకోసం మూడు లేదా అయిదు తోరాలను సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం అమ్మవారికి ధూప, దీప నైవేద్యాలు, వాయినం, తోరం అందించి, వ్రతంలో భాగమైన వ్రత కధ చదువుకుని, ముత్తయిదువులకు వాయినాలు చెల్లించాలి.
- వరలక్ష్మీ పూజ రోజున ఇంట్లో కుటుంబ సభ్యులందరూ శాకాహారమే భుజించాలి.
- వ్రతం చేసుకున్నవారు ముత్తయిదువను సాగనంపిన తర్వాతనే భోజనం చేయాలి.
- సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తయిదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి.
- అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. సాయంకాలం కూడా పూజ చేసి, మరుసటి రోజు ఉదయం నైవేద్యం పెట్టిన తరువాత మాత్రమే ఉద్వాసన చెప్పాలి.
- ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
ఇలాంటి జాగ్రత్తలన్నింటినూ సాగే వరలక్ష్మీ వ్రతం ఆడవారి జీవితంలో ఎలాంటి అమంగళమూ జరగకుండా కాపాడుతుంది.