భరతనాట్యం భారతీయ కళల్లో గుర్తింపు కలిగిన కళ

భరతనాట్యం మన భారతీయ కళల్లో గుర్తింపు కలిగిన  కళ. ఈ భరతనాట్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. తమిళనాట పుట్టింది. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "తంజావూరు"లో 'నట్టువన్నులు' మరియు దేవదాసీలు ఈ కళకు పోషకులు. భావం, రాగం, తాళం - ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయని. కట్టుబాట్లు మరీ ఎక్కువని చెబుతారు.

నాట్య శాస్త్రంలో చెప్పబడిన ప్రకారం శివుడు కైశికీ పద్ధతిలో నృత్యం చేయగా అదే నేడు భరతనాట్యం గా ఖ్యాతికెక్కింది అంటారు కొందరు. ఆ నృత్యంలో విస్తృతమైవ భంగిమలు ఉన్నాయి. మృదు అంగహారాలు, చేతులు, కాళ్ల కదలికలు, రసములు, భావములు ఉన్నాయి. ఆ నృత్యంలో ధరించే వస్త్రాలు నృత్యకళలకు ఆత్మ వంటివి. అవి ప్రత్యేకంగా అత్యంత మనోహరంగా ఉంటాయి. శృంగారమే భరతనాట్యానికి నృత్యానికి మూలం అని నాట్య శాస్త్ర నిపుణులు అంటారు. మగవారు కన్నా ఆడవారు ఈ నృత్యాన్ని రసవత్తరంగా చేయగలుగుతారని పతీతి చెందింది. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి.

భరతనాట్యం - తమిళుల చొరవ


ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు తంజావూర్ కు చెందిన పొన్నయ్య, చెన్నయ్య, వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు. వీరు 18వ శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ మీనాక్షీ సుందరం పిళ్ళై వీరి వారసులే. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో " కళాక్షేత్ర " అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.

భరతనాట్యం రెండు పదాల కలయిక


భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం ‘భరతనాట్యం’ రెండు పదాల కలయికగా ఆవిర్భవించింది. ’’భరత‘‘, ‘‘నాట్యం’’. నాట్యం అనేది ఒక సంస్కృత పదం. దానికి నృత్యము అనే ఒక అర్థం వస్తుంది. భరత అనే పదం పేరు ప్రకారం భారతదేశంలో పుట్టింది కాబట్టి లేదా భారత మహామునిచే ప్రతిపాదించింది కాబట్టి అని అనుకుంటాం. కానీ భరతనాట్యం లోని ‘భరత’ అనే పదం భా, రా, తా మూడు పదాల సమ్మేళనం. ఇవేంటంటే భావ, రాగ, తాళ. భావము, రాగము, తాళముల సమ్మేళనమైనటువంటి నాట్యం కాబట్టే దీనికి భరతనాట్యం అని శాస్త్రీయంగా పేరొచ్చింది అని పుతారు.

దీనికి సిద్ధాంతీక పరంగా సాదిర్ అనే నాట్యం నుంచి భరతనాట్యం ఆవిర్భవించింది అంటారు. మన పురాతన సంగీత నాట్యశాస్త్ర నిపుణులు భరతమహాముని తన నాట్యశాస్త్ర గ్రంథంలో క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో భరతనాట్యాన్ని గురించి తెలియచేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ తరువాత క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో దీని రూపాంతరంలో మార్పులు చోటుచేసుకున్నాయని చెపుతారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు భరతనాట్యాన్ని మొదటిగా ఆవిష్కరించారని, దాన్ని భరతమహాముని గ్రాంధీకరించారని, నాట్యశాస్త్రంలో పొందుపరిచారని చెపుతారు.

భరతుడు రాసిన నాట్యశాస్త్రములో వేలాది నాట్య రూపాల గురించి ప్రస్తావన ఉంది. వాటిలో ప్రముఖంగా నృత్య అనే పదాన్ని నృత్యముగా అభివర్ణిస్తూ వచ్చారు. ఈ నృత్యరూపంలో చేతులతో, కళ్ళతో, ముఖంతో-కదలికలు, హావభావాల సమ్మేళనంతో ఏర్పడేదే నృత్యంగా పేర్కొన్నారు. వాటి సమ్మేళనంగా భరతనాట్యం రూపాంతరం చెందింది.

ఎక్కువగా తమిళనాట ఈ నృత్యం జీవంపోసుకుంది. తమిళసాహిత్యం మైన ‘శిలప్పాతికరం’ లో భరతనాట్యం యొక్క పూర్వాపరాలను పొందుపరచడం జరిగింది. తమిళనాడులో ఉండే శివాలయా్ల్లో పరమేశ్వరుని భరతనాట్య భంగిమలు అద్భుత శిల్పకళాఖండాలుగా మలచబడి మనకు కనిపిస్తాయి. తమిళనాడులోని చిదంబరంలోని తిల్లై నటరాజ్ పూర్ లో శివుడు 108 భరతనాట్య భంగిమల్లో మనకు ఆలయప్రకారాల్లో కనిపిస్తాడు.

భరతనాట్యం ఆలయ నృత్యం


భరతనాట్యం పూర్వకాలం నుంచీ కూడా ఒక ఆలయ నృత్యం గానే కొనసాగుతూ వచ్చింది. దేవదాసీ లు భగవంతునికి చేసే సేవలో భరతనాట్యం కూడా ఒకటిగా ఖ్యాతికెక్కింది. తరువాత క్రమేపీ తమిళనాడు వీడి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఆలయ కళగానే విస్తరించింది. 17వ శతాబ్దం నాటికి ఈ నృత్య రీతుల్లో అనేక సమకాలీన మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.

భరతనాట్యం పై బ్రిటిష్ వారి నిషేధం


అప్పట్లో హిందూ దేవాలయాల్లో పురాణగాధలు, హిందూ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపడుతూ భగవంతునికి ఒక నివేదనగా భరతనాట్యం కొనసాగుతూ వచ్చింది. 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ మన భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత వారీ నృత్య కళను వ్యతిరేకించారు. భరతనాట్యం తోపాటు విభిన్న నృత్య కళలపై బ్రిటిష్ వారు ఉక్కుపాదం మోపారు. 1892 లో బ్రిటిష్ పాలకులు భరతనాట్యం తోపాటు సాంప్రదాయ కళలు నిషేధించడంతో 1910 నాటికి అప్పట్లోని సాంప్రదాయ కళల్లో కీలకమైనదైన భరతనాట్యం సుమారు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.

దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా కళాకారులు మన సాంప్రదాయ నృత్యాన్ని పరిరక్షించడానికి ఉద్యమాలు చేపట్టడమే కాకుండా సంగీత నృత్య అకాడమీలను ఏర్పాటుచేయడం, వాటిని నేర్పించడం వంటి చర్యలను స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా చేపట్టడం ద్వారా మన కళలను పదిలపరిచారు. వివిధ పరిణామాల అనంతరం భారత స్వాతంత్ర్యానంతరం మన భారత కళలు పునరుజ్జీవితులయ్యాయి.