బ్రహ్మోత్సవాలు 2018 -తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల విశిష్ఠత

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవమంటే.. బ్రహ్మాండమంతా మారుమోగాల్సిందే... హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. కలియుగ వైకుంఠమైన సప్తగిరులు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. తిరుమల వెంకన్న క్షేత్రం మహిమాన్వితం. ‘వేం’ అంటే పాపాలు.. ‘కట’ అంటే హరించడం అని అర్థం..అంటే వేంకటేశ్వరస్వామి సమక్షంలో ఉంటే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాలు - వేంకటాచలపతి సింగారాలు


ఈ ఏడాది అధికమాసం రావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల అంటే సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా గాంచి ఆ తిరుమలేశుని దర్శనం లభించడం కోసం మన రాష్ట్రం నుంచే కాకుంగా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆపదమొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు కొండెక్కుతాయని కొలిచేవారు కొందరైతే.. వైకుంఠవాసుని దివ్య దర్శనంతో జన్మ తరింపజేసుకోవాలనుకునే వారు ఇంకొందరు.. గంటలు.. రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఆ దేవదేవుని దర్శించుకుని గాని తిరిగి వెళ్లరు... ఇక బ్రహ్మోత్సవ సమయాల్లో అయితే.. ఆ తొమ్మిదిరోజులపాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తారు. కలియుగ వైకుంఠంపై వెలసిన వేంకటాచలపతి.. సకల సింగారాలతో తిరువీధుల్లో మెరిసిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.

ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల దరిచేరేందుకు సన్నద్దమవుతున్నాడు. తిరుమల ఆలయంలో నిత్యకళ్యాణం పచ్చతోరణమే.. అలాంటి  ఏడాదికొకసారి కమనీయంగా జరిగే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవ వేడుకలు చూసి తరించేందుకు రెండు కళ్లు సరిపోవు.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను తిలకించి ఆయన కృపాకటాక్ష వీక్షణల కోసం భక్త కోటి ఉవ్విళ్లూరుతుంది. బ్రహ్మోత్సవ వేళ కోసం వేయి కళ్లతో ఎదరుచూస్తున్నారు వెంకన్న భక్తులు. ‘సెప్టెంబరు 13న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా భ్రహ్మోత్సవాల విశేషాలు తెలుసుకుందాం.

బ్రహ్మోత్సవాలు సాక్షాత్తూ బ్రహ్మచే ప్రారంభమయ్యాయి


పద్మావతీ దేవితో వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడట. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించారు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకోవడం విశేషం. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన ఉత్సవాలు బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.. తొమ్మిదిరోజుల పాటు అత్యంత శోభాయమానంగా జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు ముక్కోటిదేవతలు ఒక్కటై తిరుమలకు వస్తారట. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి.. చిత్త నక్షత్రం రోజున ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు.. శ్రవణ నక్షత్రం రోజున ధ్వజా అవరోహణంతో పూర్తవుతాయి... బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తి మలయప్పస్వామి దేవేరులతో కలిసి స్వర్ణాలంకృతమైన వాహనాలపై ఆశీనుడై.. తిరువీధుల్లో విహరిస్తాడు... బ్రహ్మ ఉపదేశానుసారంతో ఈనాటి వరకు ఇదే విధంగా బ్రహ్మోత్సవం జరుగుతోందటని పురాణాలు చెబతున్నాయి.

బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభం


స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి ముందురోజుగానీ మూడు రోజులు, అయిదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిదిరోజుల ముందుగానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలో నైరుతిదిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత, నిర్ణీత పునీత ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారమునందు లలాట, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే 'మత్సంగ్రహణం' అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో అనగా కుండలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయిందని వేదపండితులు చెబుతారు.

బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని గరుడధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభంమీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం.

అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. సాయంత్రం స్వామివారి ఉత్సవాలకు ధ్వజారోహనం పూర్తికాగానే శ్రీవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రంగనాయక మంటపంలో విశ్రమింపజేస్తారు.

బ్రహ్మోత్సవాలు - వాహనసేవలు


బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనది పెద్దశేషవాహనం. స్వామి శేషతల్పశాయి. ఆయన కొలువున్న కొండ- శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు . మొదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని తొమ్మిదోరోజు ఉదయంపూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటిరోజుకే వచ్చి చేరింది.

చిన్నశేష వాహనం - హంసవాహనం


రెండో రోజు- ఇక శ్రీనివాసును బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని 'వాసుకి'కి ప్రతీకగా పరిగణించటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. రెండో రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి, విద్యాలక్ష్మిగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పాలను, నీళ్లను వేరుచేసినట్టుగానే.. దేవుని ఆదేశాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతనవైపు జీవితాన్ని మరల్చుకోవాలన్నది హంసవాహన సారాంశం.

సింహవాహనం- ముత్యపుపందిరి వాహనం


మూడో రోజు- ఇక మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. యోగశాస్త్రంలో సింహవాహన శక్తిని గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు.. భవబంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగ సాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్రలోని స్వామి రూపం తెలియజేస్తుంది.. ఈ వాహనంపై ఊరేగే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బాధలు, భయాలు దరిచేరవని భక్తుల నమ్మకం.. అంతేకాదు సకల చరాచర సృష్టికి మూలం శ్రీమహావిష్ణువు.. అందువల్లనే బ్రహ్మోత్సవాల్లో ఇలా పక్షులు, జంతువులపై స్వామివారు ఊరేగుతారట. ఇక మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ముత్యపు పందిరి చల్లదనానికి చిహ్నమట.. ముత్యపుపందిరి వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే మనసు నిర్మలమవుతుందని భక్తుల నమ్మకం.

కల్పవృక్షవాహనం - సర్వభూపాల వాహనం


నాలుగో రోజు- ఇక నాలుగోరోజు ఉదయం, స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షానికి మన పురాణ, ఇతిహాసాలలో ఓ విశిష్ఠ స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారమన్నది వేరుగా చెప్పేదేముంది! కోరిన వరాలిచ్చే దేవతా వృక్షం కల్పవృక్షం.. శ్రీవారిని హృదయంలో ప్రతిష్టించుకున్నట్టే.. ప్రతి మనిషీ.. తన హృదయాన్ని కల్పవృక్షంగా మార్చుకోవాలన్నది కల్పవృక్ష వాహనసందేశం.. కల్ప వృక్ష వాహన సేవ అనంతరం స్వామివారు సర్వభూపాలవాహనంపై విహరిస్తారు.. లోకంలో భూపాలకులందరికీ అధిపతి ఆ శ్రీమన్నారయణుడేననడాన్ని ఈ వాహనం సేవ తెలియజేస్తుంది. పశుపక్ష్యాదులను తన వాహనాలుగా మలచుకుని తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామివారు భూపాలురపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సర్వభూపాల వాహన సేవలో ఉభయ నాంచారులతో ఊరేగుతారు.. ఈ సేవలో పాల్గొనే భక్తులకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం సిద్దిస్తుందని నానుడి.

మోహినీ అవతారం- గరుడవాహనం


అయిదో రోజు- బ్రహ్మోత్సవాలలో అయిదోరోజుకు ఓ విశిష్టస్థానముంది. ఈ రోజు స్వామివారు ఉదయం మోహినీ అవతారంలో రాత్రికి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు. ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి నుంచి తెచ్చినట్లుగా చెప్తారు. ఈసేవలో స్వామివారిని బంగారు చీర, సూర్య, చంద్రహారాలు, రత్నకిరీటాలు, కర్ణపత్రాలు, వజ్రపు ముక్కుపుడకతో అలంకరించి పల్లకీలో ఊరేగిస్తారు.. మంచిపనులు చేయడం ద్వారా భగవంతుడి అనుగ్రహం ఎలా పొందవచ్చో ఈ అవతారం ద్వారా శ్రీమహావిష్ణువు భక్తకోటికి వివరిస్తారని చరిత్ర చెబుతోంది.. అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి మిగిలిన వాహన సేవలకు భిన్నంగా మోహినీ అవతారంలో ఊరేగుతారు.

ఐదోరోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు.. శ్రీవారు ధరించే విలువకట్టలేని ఆభరణాలను గరుడ సేవలో మాత్రమే వినియోగిస్తారు.. వైష్ణవ పురాణాల్లో గరుడంటే ప్రధమ భక్తుడని అర్థం.. అదేకాక వేదాలకు ప్రతిరూపంగా గరుట్మంతుని భావిస్తారు.. అందుకోసమే గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత. అలాగే స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు. గరుడ వాహనసేవ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల వెంకన్న దర్శనార్ధం విచ్చేస్తారు. ఆ రోజు తిరుమలకు చేరుకున్న భక్తులు ఆరో రోజు స్వామివారి వాహన సేవల్లో పాల్గొని శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారు.

హనుమంతవాహనం - స్వర్ణరథం


ఆరో రోజు మహాభక్తుడైన హనుమంతుడు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.. ఆ రోజున ఉదయం దేవదేవుడు... హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.. ఆంజనేయుని దర్శించడం ద్వారా భక్తిపై ఏకాగ్రత కలగడమే కాక.. భయం, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆరోరోజు సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి బంగారు రథంపై ఊరేగుతారు.. స్వర్ణ రథంపై స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.. అనంతరం వెంకటేశ్వరస్వామిన చతురంగ బలాలతో గజనవాహనంపై విహరిస్తారు.. శ్రీవారి సార్వభౌమత్వానికి ప్రతీకకగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చాటుకునే రీతిలో రజత కంతుల మధ్య గజ వాహనసేవ జరుగుతుంది.. ఈ వాహన సేవలో పాల్గొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

సూర్యప్రభవాహనం - చంద్రప్రభ వాహనం


ఏడో రోజు- ఏడోరోజు ఉదయం- మలయప్ప స్వామివారు సూర్యప్రభవాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం.

మహారథ వాహనం - అశ్వవాహనం


ఎనిమిదో రోజు- ఎనిమిదో రోజు ఉభయదేవేరులతో కలిసి మలయప్ప స్వామి మహారథంపై విహరిస్తారు.. శ్రీవారి మహారథం విశ్వమానవుడికి ప్రతీక.. సృష్టిలో ప్రతి జీవరాశిలోనూ శ్రీమహావిష్ణువు ఉన్నాడనే సత్యాన్ని చెప్పడానికి ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు.. శ్రీవారి మహారధం తన గమనాన్ని గమ్యం వైపు నడిపించాలంటే తనువులో దేవదేవునిప్రాణప్రతిష్ట చేసుకుని.. రథాన్ని లాగాల్సిందేనని పురాణాలు చెబుతున్నాయి.. రథోత్సవం సమయంలో స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇక రధం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. సైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు. ఇక ఆ రోజు రాత్రి స్వామివారు బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని.. అందుకే అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు.. భౌతిక జ్ఞానేంద్రియాలను కట్టడి చేసి దివ్యమైన జ్ఞానం సిద్ధింపజేయాలని భక్తులు స్వామివారిని వేడుకుంటారు.

తిరుమంజన సేవ - చక్రస్నానం


తొమ్మిదో రోజు- బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతిమ ఘట్టం శ్రీవారి పుష్కరిణీ గట్టుపై శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామికి తిరుమంజనం జరుగుతుంది. అదే సమయంలో స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు.. ఆ నీటిని తలపై చల్లుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చక్రస్నానాన్ని చూసి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరకుంటారు. చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే.

బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. బ్రహ్మోత్సవాల అనంతరం జరిగే మరో ముఖ్యమైన ఉత్సవం.. తిరుగు పయనం ..మాఢవీధుల్లో అపసవ్య దిశలో స్వామివారిని ఊరేగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత..కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాన్ని చూసి తరించేందుకు భక్తకోటి ఎదురుచూస్తుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతాయి. అప్పుడే తొమ్మిది రోజులు గడిచాయా అన్నట్టు భక్తులు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వీడ్కోలు పలుకుతూ భారమైన గుండెలతో వీడలేక వీడలేక తిరుమల గిరులను వీడుతారు. అయితే ఈ సారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉండటంతో తిరుమల వెంకన్న వైభవాన్ని మదిలో ముద్రించుకునేందుకు భక్తులు తహతహలాడుతున్నారు.