గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన శ్రీ గరుడాళ్వార్, పోటు తాయార్లు, శ్రీవరదరాజస్వామి, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ విష్వక్సేన, శ్రీ భాష్యకార్లు, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు.
కొనసాగుతున్న ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులు
శ్రీవారి ఆలయంలో ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు రూ.1.5 లక్షలు విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు రూ.4 లక్షలు విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వరస్వామివారికి అలంకరించేందుకు రూ.1.75 లక్షలు విలువైన వెండి మకరతోరణాన్ని టిటిడి సిద్ధం చేసింది.
మహాశాంతి పూర్ణాహుతి
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, ఆ తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Source