అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

కళాకర్షణ


రాత్రి 7 నుండి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతోపాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం) లోకి ఆవాహన చేస్తారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4 కళలు చొప్పున మొత్తం 48 కళలు ఉంటాయి. ఈ 48 కళలను కుంభంలోకి ఆవాహన చేస్తారు.

ఈ కుంభాలతోపాటు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు, శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీ చక్రత్తాళ్వార్‌, శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీక ష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు.

ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీ విష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వార్‌, ప్రసాదం పోటులోని అమ్మవారు, లడ్డూపోటులోని అమ్మవారు, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళతారు.

మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుండి హోమాలు నిర్వహిస్తారు.

Source