శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో ఇందుకోసం యాగశాలను సిద్ధం చేశారు. ఇక్కడ శ్రీవారి మూలవర్లకు 5, ద్వారపాలకులకు 1, విమాన వేంకటేశ్వరస్వామివాకి 1, శ్రీగరుడాళ్వార్‌కు, ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీ వరదరాజస్వామివారికి, ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద పోటు తాయారుకు 1, పడిపోటు తాయారుకు 1, శ్రీ విష్వక్సేనులవారికి 1, భాష్యకార్లకు 1, శ్రీ యోగనరసింహస్వామివారికి, ఆలయ గోపురానికి కలిపి 2, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారికి -1, శ్రీ బేడి ఆంజనేయస్వామివారు, ఆలయ గోపురానికి కలిపి 2, ఇతర వాస్తుహోమగుండాలు కలిపి మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటుచేశారు.

సాయంత్రం ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆలయంలోని శ్రీ విష్వక్సేనుల వారికి హారతి ఇచ్చి ఆలయ ప్రదక్షిణగా వసంత మండపానికి చేరుకుంటారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత వసంతమండపం వద్ద మేదినిపూజ నిర్వహిస్తారు. అక్కడ పుట్టమన్ను సేకరించి ఆలయానికి చేరుకుంటారు. యాగశాలలోని పాలికల్లో నవధాన్యాలు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపడతారు. రాత్రి 9 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఋత్విక్‌ వరణం


ఆలయంలో శనివారం ఉదయం ఋత్విక్‌వరణం జరిగింది. ముందుగా 44 మంది ఋత్వికులు, 16 మంది సహాయకులు, ఇతర వేదపారాయణందారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. ఆ తరువాత ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు ఋత్వికులకు యాగగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన వస్త్రాలను ఋత్వికులకు అందజేశారు. ఈ వస్త్రాలను పసుపునీటిలో తడిపి ఋత్వికులు దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో మాత్రమే ఈ పసుపు వస్త్రాలను ఋత్వికులు ధరిస్తారు.

Source