ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు టిటిడి పూర్తిచేసింది. పవిత్రోత్సవాల అంకురార్పణం సందర్భంగా సోమవారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం కార్యక్రమం నిర్వహించారు.

ఋత్విక్‌వరణంలో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారని తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.  1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.

Source