రాఖీ పండుగ 2018: పవిత్రబంధాలకు ప్రతీక రక్షాబంధనం

రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమినాడు మనం జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. దీనినే రక్షాబంధన్ అని కూాడా పిలుస్తారు.

రాఖీ పండుగ ఎలా మొదలైంది


అసలు రాఖీ పండుగ ఎలా మొదలైంది అంటే శ్రావణపౌర్ణమిరోజు జరిగే ఈ పండుగకి ఓ కథ ఉంది. దేవతలు, రాక్షసుల చేతిలో ఓడారు. ఇక పూర్తిగా నిస్సత్తువ ఆవహించిన సమయంలో ఇంద్రునిభార్య శచీదేవి, బృహస్పతి సలహాపై ఒక తాయెత్తుని ఇంద్రునికి కడుతుంది. అంతే యుద్ధంలో ఇంద్రుడు విజృంభించి రాక్షసుల్ని ఓడిస్తాడు. అలా శ్రావణపౌర్ణమిరోజు రక్షగా చేతికి తోరం కట్టుకోవడం ఆచారమైంది.

ఇక చరిత్రలో రాజపుత్ర రాజులు కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మేవాడ్ మహారాణి కర్మవతిపై బహదూర్ షా కన్నేసాడు. ఆమె తన రక్షణకోసం మొగల్ రాజైన హుమాయూన్ కి రాఖీపంపింది. అతను వెంటనే ఆమెను కాపాడాడు. ఇక స్వతంత్ర సంగ్రామంలో కూడా సేనానులు చేతికి దారం కట్టుకుని అదే వీరకంకణంగా భావిస్తూ సైన్యంలో సోదరత్వాన్ని పెంపొందింపచేస్తుండేవారు.

యుద్ధభూమినుంచి సమాజంలోకి చేరిన రాఖీ


మనుష్యుల్లో ప్రేమ, ఆప్యాయత, మమతను పరిమళింపచేయడం కోసం గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతినికేతన్ లో ఈ రక్షాబంధన కార్యక్రమం ఏర్పాటుచేసేవారు. క్రమంగా యుద్ధభూమిని వదిలిన రాఖీ, సమాజంలో పాతుకుపోయింది. ఓ సాంప్రదాయంగా, తమ సోదరులకు శుభం కలగాలని కోరుతూ అక్కచెల్లెళ్ళు రాఖీలు కట్టసాగారు. తొలుత అది కేవలం నూలుపోగు గానే ఉండేది. కానీ క్రమేణా నగిషీలతో ప్లాస్టిక్ చెమ్కీ రంగురంగుల అట్టముక్కలు మొదలు వెండి, బంగారు రాఖీలు ఎవరి తాహతుకి తగ్గట్లు వారు కొనేట్లుగా మార్కెట్లోకి వచ్చాయి.

పూర్వం ఉమ్మడికుటుంబాల్లో ఆప్యాయతానురాగాలుండేవి. ఈ రాఖీపండుగ ఉత్తరాదిన ఎక్కువగా అమల్లో ఉంది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో దీన్ని ఒక వేడుక, ఫ్యాషన్ గా జరుపుతుంటారు.

https://www.youtube.com/watch?v=rtufx9XebA0

రాఖీకట్టే సమయంలో...


ఏన బద్దో బలీరాజా దానవేంద్రో మహా బలః
తేన త్వామభి బధ్నామి రక్ష మాచల మాచల II 


ఈ శ్లోకానికి అర్థమేంటంటే మహాబలుడు, రాక్షసేంద్రుడు అయిన బలిచక్రవర్తిని కట్టిపడవేసిన విష్ణుశక్తిచే నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షాబంధనమా! నువ్వు ఏమాత్రం చలించకు...చలించకు. రాఖీకట్టడం ద్వారా అన్నతమ్ముళ్ళకు ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలగాలని, వివిధ ఉపద్రవాలనుంచి రక్షణ కలగాలని అక్కచెల్లెళ్ళు కోరుకుంటారు. రాఖీ కట్టే సమయంలో అక్కచెల్లెళ్ళు ఈ మంత్రాన్ని పఠిస్తారు.

ఈ మంత్రం చదువుతూ రాఖీ కట్టిన తరువాత సోదరునికి తీపి తినిపించి, హారతి ఇస్తుంది సోదరి. చిన్నవాళ్ళయితే సోదరుడి ఆశీర్వాదం పొందుతారు. పెద్దవాళ్ళయితే వారిని ఆశీర్వదిస్తారు. తరువాత సోదరికి ప్రేమ సూచకంగా సోదరుడు ఏదో ఒక బహుమతిని అందించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది.