శ్రావణ పౌర్ణమి 2018: శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే వివిధ పండుగలు

శ్రావణమాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రవణా నక్షత్రం రోజున పౌర్ణమి వస్తుంది కనుక ఈ మాసం శ్రావణ మాసమైంది. ఈ మాసం శివ కేశవులివరువురికీ ప్రీతిపాత్రమైంది. అంతేకాక ఈ మాసంలో లక్ష్మీదేవి విశేషంగా పూజింపబడుతూ పౌర్ణమి నాటికి 16 కళలతోనూ విరాజిల్లుతూ ఉంటుంది. భక్తులకు సిరిసంపదలను ప్రాసాదిస్తుంది. శ్రావణ పౌర్ణమినాడే రాఖీపండుగ, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవజయంతి తదితర పండుగలు జరుపుకుంటూ ఉంటాం.

రాఖీ పౌర్ణమి


రాఖీ దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ. సోదరీ సోదరులు తమ ప్రేమాభిమానాలను తెలియచేసుకుంటూ ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ తమను కన్నవారికి కనులను విందుచేసే పండుగ. అలాగే రాఖీని కట్టి హారతి ఇచ్చి కానుకలు పుచ్చుకోవడమూ ఆనవాయితీ.అన్నదమ్ములు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తే అక్కచెల్లెళ్ళు వారికి హారతి ఇచ్చి, కుంకుమ దిద్ది, తీపి వస్తువులను తినిపిస్తారు.

నూలి పున్నమి


ఈ రోజున ఉపనయనం అయినవారు పాత యజ్ఞోపవీతాలను తీసివేసి, కొత్తవాటిని ధరిస్తారు. కాబట్టి దీన్ని జంధ్యాలపౌర్ణమి అనీ, నూలిపున్నమి అనీ కూడా పిలుస్తారు.

నారికేళ పూర్ణిమ


మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలవారు ఈ రోజున సముద్రానికెళ్ళి పూజచేసి కొబ్బరికాయలను సమర్పిస్తారు. కాబట్టి దీన్నే నారికేళ పూర్ణిమ, నార్లీపున్నమి అని కూడా అంటారు. శరత్పూర్ణిమగా పిలిచే ఈ రోజున చంద్రుడు 16 కళలతో వెలుగులు విరజిమ్ముతూ అమృతధారలు కురిపిస్తాడని ప్రతీతి. అందుకే ఆరోజు చంద్రోదయ సమయంలో చేసే సత్యనారాయణ వ్రతం అత్యంత ఫలప్రదం.

హయగ్రీవజయంతి


ఇక ఈ శ్రావణపౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే హయగ్రీవజయంతిని జరుపుకోవడం. హయగ్రీవుడు, మానవదేహంతో, గుర్రపుతలతో నాలుగులేక ఎనిమిది చేతులతో శ్రీమహావిష్ణువు ఆయుధాలను, చిహ్నాలను ధరించి ఉంటాడు. మధుకైటభులనే ఇరువురు రాక్షసులు వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాచేస్తారు. శ్రీమహావిష్ణువు హయగ్రీవరూపంలో సముద్రంలో దూకి రాక్షసులను సంహరించి వేదాలను రక్షించి తెస్తాడు. కాబట్టి హయగ్రీవుడంటే విద్యాబోధనలనందించే జ్ఞానగురువుగా భావించి ఆయనకు ఈనాడు పూజాదికాలు నిర్వహిస్తాం.

ఒకసారి బ్రహ్మదేవుడు, దేవతలు అంతాకలిసి తమలో ఎవరుగొప్పవారని పరీక్షలు జరిపి, ఆ పరీక్షలో అందరికన్నా శ్రీమహావిష్ణువే గొప్పవాడని నిర్ణయించారట. బ్రహ్మకు కోపం వచ్చి విష్ణుమూర్తి శిరస్సుతెగిపడుగాక, అని శాపమిచ్చాడట. అలా శిరస్సు కోల్పోయిన విష్ణుమూర్తి దేవతలు చేసిన యజ్ఞానికి గుర్రపుతలతో వచ్చాడట. తర్వాత ఆయన ధర్మారణ్యానికి వెళ్ళి ఘోరమైన తపస్సు ఆచరించగా ఈశ్వరుడు వచ్చి పూర్వపు శిరస్సును ప్రాసదించాడట. ఇది స్కందపురాణ గాధ. ఏ పురాణాల్లో ఎలా ఉన్నా జ్ఞానదాతగా, గురువుగా, పౌర్ణమినాడు పూజలందుకునే దేవుడాయన.

రాధాకృష్ణుల రాసలీలా ఉత్సవాలు


శ్రావణమాసంలో పౌర్ణమిరోజున బృందావనంలో రాధాకృష్ణుల రాసలీలా ఉత్సవాలు కన్నులవిందుగా అద్భుతంగా జరుగుతాయి. పదహారువేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు రాసలీల జరిపి గోపికలను ఆనందపరవశులను చేశాడు. ఆత్మ, పరమాత్మల సమ్మేళనంలోని అంతరార్ధాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకుని రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకున్నాడు. గోపికల్లోని శారీరక మోహావేశాల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్ధాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియచేశాడు. యోగమాయ సహకారంతో ప్రతి ఒక్క గోపికకి ఒక కృష్ణుని సృష్టించి గోపాలుడు తనకే స్వంతం అనే భావనను కలుగచేసి ఆనందంలో ముంచెత్తాడు. వైష్ణవ భక్తకవులు, జయదేవుడు, సూరదాసు స్వామి, హరిదాసు, గోవిందస్వామి మొదలైనవారంతా శ్రీకృష్ణపరమాత్మ ప్రవచించిన తాత్వికసారాన్ని భక్తజనులకు సరళమైన రీతిలో గీతాల రూపంలో అందించారు.

షిరిడీసాయి పాదుకల స్థాపన పుణ్యదినం శ్రావణ పౌర్ణమి


శ్రావణ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉంది. 1912 వ సంవత్సరములో శ్రావణ పౌర్ణమినాడు బాబా తన స్వహస్తాలతో తాకి పావనం చేసిన పాదుకల స్థాపన షిరిడీ క్షేత్రంలో బాబా మొదటగా కూర్చున్న వేపచెట్టు మొదట్లో జరిగింది. ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే అనేకమంది భక్తులు శ్రావణ పౌర్ణమి రో జున ఆ సాయి పాదుకలను దర్శించుకుని ధన్యులవుతారు.