తిరుమల సమాచారం: శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయంపై పునఃసమీక్ష

ఆఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని పునః సమీక్షిస్తామని టిటిడి తెలిపింది. ముఖ్యమంత్రి  ఆదేశం మేరకు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలను పునః సమీక్షిస్తున్నారు.

ఇందుకు అనుగుణంగా నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు భక్తుల నుండి అభిప్రాయసేకరణ జరుగుతుంది. ఈనెల 24వ తేదీన జరుగనున్న టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో మహాసంప్రోక్షణం జరుగు రోజులలో అందుబాటులో ఉన్న తక్కువ వ్యవధిలో భక్తులకు ఏవిధంగా దర్శనం కల్పించవచ్చు అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు 6 రోజులలో దాదాపు 30 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మనకున్న సమయంలో రోజుకు దాదాపు 15 వేల మంది వరకు భక్తులను అనుమతించే అవకాశం ఉందన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడాలనే లక్ష్యంతోనే గతంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్‌, ఈవో తెలిపారు.

Source