భక్తి యందు చిత్తశుద్ధి కలిగి సమర్పిస్తే అది భగవంతునికి అమృతతుల్యమే

భగవంతుని ప్రసన్నం చేసుకునేందుకు భక్తుడు పలు రకాల మార్గాల్లో ప్రార్థిస్తుంటాడు. ధూప, దీప, నైవేద్యాదులు సమర్పిస్తుంటాడు. అయితే భగవంతుడు భక్తులనుంచి ఏం కోరుకుంటాడు అంటే గీతలో కూడా శ్రీకృష్ణపరమాత్మ ఒకటే అంటున్నాడు... అదే భక్తుని మనఃచిత్తము. భగవంతునిపై ఎంత విశ్వాసం ఉంచి ప్రార్థిస్తామో అంతగా మనల్ని ఆయన కరుణిస్తాడు. మనం నివేదించే పదార్ధాలు ఘనమైనవే అవ్వనక్కరలేదు. సూక్ష్మమైనవైనా భక్తియందు చిత్తశుద్ధి కలిగి సమర్పిస్తే అది భగవంతునికి అమృతతుల్యంతో సమానం. అది ఎలా? అనే అంశాన్ని మన పెద్దలు ఈ పరమార్ధ కథలో చక్కగా వివరించారు.

పూర్వం హరినారాయణుడనే ఒక శ్రీమన్నారాయణుని పరమ భక్తుడు ఓ కుగ్రామంలో నివసించేవాడు. అతను ప్రాపంచిక విషయాలపై దృష్టిపెట్టకుండా నిత్యం హరినామస్మరణతోనే కాలం వెళ్ళబుచ్చేవాడు. ఎప్పుడూ శ్రీమన్నారాయణుని విగ్రహం ముందు కూర్చుని భక్తితో నారాయణ మంత్రాన్నే పునశ్చరణ చేస్తూ ఉండేవాడు. వైరాగ్యసంపన్నుడై ఇహ లోక భోగాలకు దూరంగా జీవితాన్ని ఆ శ్రీమన్నారాయణుని సేవకే అంకితం చేసుకున్నాడు. ఒకరోజు రోజూలాగే తన ఇంటి పూజామందిరంలో శ్రీమన్నారాయణుని విగ్రహం ముందు కూర్చుని హరినామస్మరణతో కూడిన మంత్రజపంలో నిమగ్నమైయుండగా అతని భక్తికి మెచ్చి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు.

ఈ హఠాత్‌ పరిణామానికి సంభ్రమాశ్చర్యానికి గురైన హరినారాయణ శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యం కలిగినందుకు పులకించిపోయాడు. పరవశంతో తదేక దృష్టితో కాసేపు శ్రీమన్నారాయణునే చూస్తూ ఉండిపోయాడు. కాసేపట్లో తేరుకుని సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే తనింటికి వేంచేసి ఉండగా ఆయనకు తనేమీ సపర్యలు చేయడం లేదేమని తనకు తానే నిందించుకుని యధాశక్తి ప్రార్థించి నివేదనకోసం ఇంటినంతా పరికిస్తూ తత్తరపడసాగాడు. ''శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం హఠాత్‌ పరిణామమాయెను...ముందుగా ఎటువంటి ఫలములను నేను సిద్ధం చేసుకొనలేకపోతిని, ఇప్పుడెట్లని'' చింతించుచుండగా దేవునిమందిరం వద్ద ఒక అరటిపండు కనిపించింది.

వెంటనే దానిని తీసుకువచ్చి పరవశంతో శ్రీమన్నారాయణుని తనివితీరా చూసుకుంటూ అరటిపండు ఒలిచి ఒకచేత్తో గుజ్జును పారవేసి, కుడిచేత్తో అరటితొక్కను భగవంతునికి నివేదనగా సమర్పించాడు. దానిని సేవించి తక్షణం శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు.

కాసేపయ్యాక తేరుకుని సంతోషిస్తున్న సమయంలో అక్కడ పడి ఉన్న అరటిపండు గుజ్జును చూసి జరిగిన విషయం గ్రహించి ఎంతో మధనపడిపోయాడు హరినారాయణ. తానెంతో అపరాధం చేశానని, తన భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు తన ఇంటికి స్వయంగా విచ్చేస్తే తానెంత తెలివితక్కువ పని చేశాననుకుని కుమిలిపోయాడు.

మళ్ళీ కాస్త ధైర్యం తెచ్చుకుని ''ఈసారి భగవంతుని సాక్షాత్కారం కోసం మరింత శ్రద్ధతో పూజ చేస్తాను, ముందుగానే ఫలాలను సిద్ధం చేసుకుంటాను. శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం లభించిన వెంటనే ఆయనకు తనివితీరా నివేదన సమర్పించుకుంటాను'' అనుకుంటూ ముందుగానే ఒక గెల అరటిపళ్ళను పూజామందిరం వద్ద సిద్ధం చేసుకుని హరినామస్మరణతో కూడిన మంత్రోచ్ఛారణతో పూజించి ఒక అరటిపండును గెల నుంచి తీసి మునుపటిలా పొరపాటు జరక్కుండా తొక్కను పారేసి గుజ్జును పట్టుకుని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనట్టు, ఆయనకు గుజ్జును మాత్రమే సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ సాధన చేయడం ప్రారంభించాడు.

ఇలా కొంతకాలం గడిచాక మళ్ళీ శ్రీమన్నారాయణుడు హరినారాయణునికి సాక్షాత్కారాన్ని కలుగచేసాడు. సంభ్రమాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బయి తాను గతంలో చేసిన ఘోర తప్పిదాన్ని మననం చేసుకుంటూ హరిని యధాశక్తి పూజించి అరటిపండును నివేదించి ఈసారి తొక్కను పారవేసి శ్రద్ధగా గుజ్జును శ్రీమన్నారాయణుని తినిపించాడు. అయితే శ్రీమన్నారాయణుడు గుజ్జును ఊసివేయడంతో హరినారాయణుడు హతాశుడయ్యాడు.

కడుదు:ఖముతో స్వామీ! నా ఎడల ఏమి పొరపాటు జరిగినదని ప్రశ్నించగా ''గతంలో నీవు భక్తిపారవశ్యుడవై నాకు సమర్పించినది అరటి తొక్కయైనను కడు రుచికరముగాయున్నది. ఇప్పుడు నీ మనసంతయూ భక్తితత్వానికి మించి అరటిపండుపై కేంద్రీకృతమైయున్నది. అందువల్ల రుచికి అమృతప్రాయమైన అరటిపండు గుజ్జు, నా నోటికి విషముగా గోచరించుచున్నది.'' అని పలుకగా హరినారాయణునికి తనలోని లోపం తెలిసివచ్చింది.

భగవంతునికి నివేదన సక్రమముగా జరగాలని భావించానే తప్ప ముందులా హరియందు దృష్టిని కేంద్రీకరించలేకపోతినన్న పొరపాటును గ్రహించి ఆ తరువాత తన సహజమైన భక్తిభావాన్ని కొనసాగిస్తూ భవబంధాలకు ఇహలోక సుఖాలకు దూరంగా శ్రీమన్నారాయణుని సేవలో కాలంగడిపాడు. అలాగే ఆ శ్రీహరి సైతం శ్రీమన్నారాయణుని భక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించాడు.

పూజాఫలముగా మనం భగవంతునికి భక్తితో సమర్పించినవి కొంచెమైనా ప్రేమతో సమర్పించినది భగవంతునికి కొండంత కాగలదు. ఈ భగవద్వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని దైవం పట్ల భక్తిభావాన్ని పెంచుకోవాలి.