చంద్రగ్రహణం అనంతరం తిరిగి తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుండి శనివారం ఉదయం 3.49 గంటల వరకు చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. శనివారం ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సర్వదర్శనం నిలిపివేసి ఆ తరువాత శుక్రవారపు ఆస్థానం, పూలంగిసేవ, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూశారు. శనివారం ఉదయం 4.15 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. శుద్ధి అనంతరం ఉదయం 5.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. శనివారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. నేటి ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

అదేవిధంగా, చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం 3 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌, టిటిడి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌ను మూసివేశారు. శనివారం ఉదయం నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

Source