శ్లో|| అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం
సాధ్వీ నిజవిభుం లతా క్షితిరుహం సింధు: సరిద్వల్లిభమ్|
ప్రాప్నో తీహ యథా తథా పశుపతే: పాదారవిందద్వయమ్
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ||
సామాన్య ప్రజలలోని భక్తియొక్క ప్రథమ దశను అంకోలా వృక్షము దానియొక్క విత్తనముల మధ్యనున్న అనుబంధం దృష్టాంతీకరిస్తుంది. అంకోలా చెట్టు గింజలు చీకటివేళలో చెట్టునుండి క్రిందపడి సూర్యోదయ సమయంలో తిరిగి చెట్టునకు చేరి అచ్చటేయుండి క్రమంగా మరలా వృక్షంలో భాగంగా మారతాయి. ఈ విచిత్ర ప్రక్రియల్ని ఋజువు పరుచుకోవాలని ప్రయత్నించాం. కానీ సఫలీకృతులం కాలేదు. కాని అటవీశాఖ వారు ఆ విత్తనాలు చెట్టువైపు కదలడం, దానిని చేరటం యదార్థమని కానీ ఆ క్రియ మనకు కనబడకుండా జరుగుతుందని ధృవీకరించారు.
అంకోలా చెట్టుయొక్క విత్తనాల వలెనే మన మందరం పరమాత్మయొక్క అణుప్రాయులం. పరమాత్మ నుంచి ఆవిర్భవించిన జీవాత్మ అన్నింటికీ మూలకారణం. పరమాత్మ నుండి మనం ఉద్భవించాం. మనల్ని ఆజ్ఞానం ఆవరించియున్నప్పుడు ఆయన్నుంచి వేరుబడి పతనం చెందుతాం. మరల అజ్ఞాన తిమిరాలు వీడి జ్ఞానోదయం కాగానే మనకు పునరుత్థానం జరిగి పరమాత్మతో అనుసంధానింపబడతాం.
ఇచ్చట అంధకారం అజ్ఞానంతోను, జ్ఞానం వెలుగు లేక సూర్యోదయం తోను పోల్చబడ్డాయి. అంధకార సమయంలో విత్తనాలు వృక్షం నుండి వేరయి క్రిందబడతాయి. అట్లే అజ్ఞానాంధకారంలో మనం పరమాత్మ నుండి విడిపోయి క్రిందకు పతనం చెందుతాం. తిరిగి సూర్యోదయం కాగానే విత్తనాలు చెట్టును చేరినట్లే మనం కూడా జ్ఞానోదయం కాగానే మరల పరమాత్మకు అనుబంధితులమౌతాం.
సాధారణంగా మనం ఇబ్బందులకు గురియైనప్పుడు మాత్రమే దైవాన్ని గురించి చింతిస్తాం. జ్ఞానాన్ని అన్వేషిస్తాం. మనజీవితం సుఖమయంగా సాగిపోతున్నప్పుడు హాయిగా ఉంటాం. మనం చేయాల్సినదంతా చేసేశామనుకుంటాం. భగవంతుని మరచిపోతాం. మనం దుస్థితిలో ఉన్నప్పుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నట్లు తలుస్తాం. అదే మన అజ్ఞానస్థితి. అప్పుడే దైవం మన స్మృతిపథం లోకి వస్తాడు. మన కష్టాన్ని పారద్రోలమని కాళ్ళావేళ్ళా పడి వేడుకుంటాం. అంధకారం ఆవరించినప్పుడు వెలుగుతో అవసరం ఏర్పడుతుంది. ఇది భక్తియొక్క ప్రథమ దశ. ఆదిశంకరులు భక్తియొక్క తర్వాతి దశను ఇలా వర్ణించారు.
''అయస్కాంతోపలం సూచిక''
ముందు మనం భగవంతుని స్మరించాలి. తర్వాత ఆయన తనంతట తానే వచ్చి మనలను ఆయనవైపు ఆకర్షించుకుంటాడు. వల్లభాచార్యుడు తదితరులు దీనినే వారి ప్రధాన సిద్ధాంతంగా రూపొందించి దాన్ని కేంద్రంగా చేసి ఈశ్వరభక్తి ఆధారంగా ఒక వేదాంతతత్వాన్ని వెలువరించారు. ఒక సూదంటురాయికి, ఇనుపముల్లునకు మధ్యనున్న ఆకర్షణ భక్తియొక్క ద్వితీయ స్థాయిని దృష్టాంతీకరిస్తుంది. మన చిన్నతనంలో సూదంటురాళ్ళను, ఇనుపరజనును సమీకరించి వాటితో ఆడుకునేవారం. అయస్కాంతం ఇనుపముక్కల సమీపానికి చేరిస్తే అవి అయస్కాంతానికి కరచుకుంటాయి. తర్వాత కొంత సమయానికి అవి క్రిందపడతాయి. మళ్ళీ అయస్కాంతం వాటిని లాక్కుంటుంది. ఇది చాలా ముఖ్యమైన వేదాంత సత్యాన్ని విశదీకరిస్తుంది. ఒక అయస్కాంతం ఇనుపముక్కల్ని ఆకర్షించే శక్తి కల్గియున్నట్లే దైవం తన ఆకర్షణతో మనలను తనవైపు తిప్పుకొని ముందుకు నడిపే ప్రభావం కల్గివుంటాడు.
కష్ట వలయాల్లో చిక్కుకొని పతనం చెందినప్పుడు, మన స్థితి అయస్కాంతం నుండి క్రిందపడ్డ ఇనుపముక్కల స్థితికి సమానం. కానీ ఇనుపముక్క నిశ్చేతన పదార్ధం అయినా దాన్ని అయస్కాంతం తనవైపు ఆకర్షిస్తుంది. కానీ మానవులమైన మనం శక్తివంతులం, జడత్వం లేనివారం. అందుచేత భగవానుడు మనలను తిరిగి సుళువుగా పైకి లేవనెత్తి తనవైపు తీసుకోగల్గుతాడు.
దైవం మన స్మృతిపథంలోకి వచ్చిన మరుక్షణం, మనపై ఆయన కృప వెల్లివిరుస్తుంది. అందువలన మనమందరం భగవానుని హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడానికి ఉద్యమించాలి. అప్పుడు ఇనుపముక్కలకు వలె మన మనస్సులు కూడ భగవంతునివైపు ఆకర్షించబడి ఆయనకు హత్తుకుని ఉంటాయి. ఇనుపముక్క అయస్కాంతం వైపు లాగబడి, దానితో అనుసంధానింపబడి యున్నంతకాలం అదికూడా అయస్కాంతీకరింపబడి ఉంటుంది. అదేవిధంగా మన మనస్సు భగవానునివైపు ఆకర్షణతో మరలింపబడి ఆయనయందు నిశ్చలస్థితిలో నున్నంత వరకూ బ్రహ్మానందానుభూతిలో తేలియాడతాం.
భక్తియొక్క మూడవ దశ ఈ క్రింది విధంగా ఉంటుంది.
''సాధ్వీ నిజవిభుం''
ఒక పతివ్రతా స్త్రీ తన పిల్లలను సాకుతూ, వంటా వార్పూ నిర్వహిస్తూ, మిగతా గృహసంబంధమైన విధులన్నింటినీ నిర్వర్తిస్తూ కూడ ఎల్లవేళలా తన పెనిమిటిని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భర్తను గురించి తలంచకుండా ఆమె ఏ పనీ చేయదు. భక్తుడు కూడ భగవంతుని స్మరణ లేకుండా ఏ కార్యాన్నీ నిర్వహించడు. అలాగే మన మనస్సులు కూడా భగవంతునిలో ఐక్యం కావాలి. దైవానుగ్రహం మనపై ఎల్లవేళల ప్రసరిస్తే మనం తలపెట్టే కార్యాలన్నీ జయప్రదంగా సాగుతాయి. వాటిని ఎక్కువ సామర్ధ్యంతో ఫలప్రదం చేసుకోగలం. ఇక్కడ భక్తి విషయమే కాక స్త్రీ ధర్మం కూడ ఉల్లేఖింపబడింది. సాధ్వియైన స్త్రీ పరపురుష ధ్యాస లేక ఎల్లప్పుడూ తన భర్తనే స్మరిస్తూ గృహకృత్యాలు నిర్వర్తిస్తుంది. దైవధ్యానంతో తన విధులను నిర్వహిస్తే మన జీవితాల్లో సర్వశ్రేయస్సులు, లాభాలు సమకూరుతాయి. తర్వాత ఆదిశంకరులు వృక్షాన్ని అల్లుకున్న తీగెయొక్క ఉదాహరణనిస్తూ ఇలా అంటారు.
''లతా క్షితిరుహం''
ఒక లత భూమిపై విరివిగా పాకి, ఆలంబనం కొరకు తుదకొక వృక్షాన్ని ఆశ్రయించి చెట్టునుండి విడదీయలేని విధంగా పెనవేసుకుంటుంది. వృక్షాన్నుండి విడదీస్తే తీగె నిలబడలేదు. జీవించలేదు. అలాగే భగవంతుని చేయూత, పోషణ లేకుండా మనం విషాదానికి గురియౌతాం. తీగెను బలవంతంగా చెట్టునుండి విడదీస్తే చెట్టుపై తరచుగా ఒక చారలాంటి గుర్తు మనకు గోచరిస్తుంది. మనం కూడ అదేవిధంగా భగవంతునికి అనుసంధింపబడతాము. ఆయన రక్షణలో మన జీవితాల్ని సాగించుకుంటాం. ఆయన సన్నిధి నుండి పతనం చెందినప్పుడు లేక ఆయన్నుండి విడిపోయినప్పుడు మనం అష్టకష్టాలకు గురియౌతాం.
అంతేకాదు భగవానుడు కూడా మనపట్ల సానుభూతితో చింతాక్రాంతుడౌతాడు. లత తన అస్తిత్వం కొరకు వృక్షం యొక్క ఆలంబనాన్ని అపేక్షించినట్లే మానవులం కూడ భగవానుని చేయూతను, ఆధారాన్ని ఆశ్రయించుకొని మనుగడ సాగించాలి. మన పరమాత్ముని వద్ద నుండే ప్రపంచంలోకి వస్తాం. తిరిగి ఆయన సాన్నిధ్యానికే చేరుతాం. తీగె విడదీస్తే తప్ప తనకై తాను వృక్షాన్నుండి విడిపోనట్లే మనం కూడ మూడవ వ్యక్తి మనల్ని భగవానుని నుంచి దూరం చేస్తే తప్ప మనకై మనం ఆయన్నుంచి దూరం కాలేము. ఆదిశంకరులు భక్తి విషయంలో సమర్పించిన నాల్గవ ఉదాహరణ ఇది.
ప్రతి వ్యక్తీ జీవితంలో ఏవో కష్టాల్ని, దైన్యాన్ని అనుభవిస్తాడు. ఈ విషయంలో పరమాత్ములకు కూడ మినహాయింపులేదు. వీటి నివృత్తికొరకు భగవానుని ఆశ్రయమొక్కటే శరణ్యం. వృక్షాన్ని ఆశ్రయించి పెనవేసుకుంటే తప్ప లత ఎలా జీవించలేదో, అలాగే జీవాత్మ పరమాత్మకు దూరమై తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేదు.
''రసాంతరాణి ఏకరసం యధాదివ్య పయోన్నుతే''
ఆదిశంకర భగవత్పాదుల వచనంలో ''సింధు: సరిద్వల్లభం''
పవిత్ర భారతభూమిపై గంగ, సోనె, గోదావరి, కావేరి, కృష్ణ మొదలుగాగల అనేక నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నింటికీ ప్రత్యేకమైన పేర్లున్నాయి. అవన్నీ వివిధ మార్గాల్లో, పలు దిశల్లో, పలు ప్రాంతాల్లో ప్రవాహ రూపంలో సెలయేళ్ళుగా గర్జన ధ్వనులతో ప్రవహిస్తాయి. పరీవాహక ప్రదేశాలననుసరించి నదీజలాల రుచి, రంగు కూడ భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు సోనె నది యొక్క నీటిరంగు ఎర్రగాను, కృష్ణానదీ జలాల రంగు నల్లగాను, గంగాజలం తెల్లగాను ఉండడం గమనిస్తాం. కానీ అన్ని నదులు తుదకు సముద్రంలో కలిసి వాటి వాటి ప్రత్యేక నామాల్ని, రంగుల్ని, రుచులను అన్నింటిని కోల్పోతాయి. సముద్ర సంగమం జరిగింతర్వాత ఆ జలాల రుచి మొత్తం ఉప్పదనం మాత్రమే. రంగు సముద్రజలాల రంగు మాత్రమే. అంటే సాగరసంగమానంతరం నదులు తమ ప్రత్యేక గుణాల్ని అన్నింటినీ కోల్పోయి సాగరంగానే పరిణమిస్తాయి.
అన్ని నదులు సాగరంలో సంగమించినట్లు, భగవత్సాన్నిధ్యాన్ని చేరే లక్ష్యంతో వివిధ మార్గాల్ని అనుసరించి, వివిధ దిశలలో పయనించి, వివిధ రూపాల్లో అవతరించిన పరమాత్ముని ధ్యానించి ప్రయత్నాలు సాగిస్తాం. భక్తులు అనుసరించే మార్గాలు వేరైనా భగవత్సాన్నిధ్యాన్ని చేరటమనే గమ్యం ఒక్కటే. రామభక్తి, కృష్ణభక్తి మొదలైన భక్తి మార్గాలెన్ని ఉన్నా అవి పరమాత్మకు అనుసంధానింపబడి ఉన్నంతవరకూ అన్నీ సారూప్యమైనవే. ఒక దేవాలయం చేరటానికి అనేక త్రోవలుండవచ్చు. కానీ అన్నింటికీ గమ్యం ఆలయం మాత్రమే.
పరమాత్మను చేరటానికి చాలా మార్గాలున్నాయి. వాటిలో భక్తిమార్గం, జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మవిచార మార్గం ముఖ్యమైనవి. ఈ మార్గాలన్నింటికీ పరమాత్మునిలో ఐక్యమవటమనే లక్ష్యం ఒక్కటే. నదులన్నీ సాగరంలో కలిసిపోయినట్లు, మనమందరం బ్రహ్మపదార్థంలో కలిసినప్పుడు మన ప్రత్యేక వ్యక్తిత్వాలన్నీ పూర్తిగా అదృశ్యమై మనం ఆనందస్వరూపులమౌతాం. ప్రతివ్యక్తి దైవానుగ్రహాన్ని సంపాదించడానికి తనకు అనుసరణీయమైన బాటను ఎన్నుకుంటాడు. అందరి అంతిమలక్ష్యం భగవదనుగ్రహాన్ని పొందటమే. గీతలో శ్రీకృష్ణుడిలా చెప్పాడు.
''యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం''
మానవులు ఏ మార్గాన్ని అనుసరించినా, ఆ మార్గం ద్వారానే వారికి భగవానుడు తన అనుగ్రహాన్ని లభింపచేస్తాడు. భగవంతుని గురించిన జ్ఞానంతో మనం ఆయనలో ఐక్యం కాగల్గితే మన కష్టాలు, దు:ఖాలు అన్నీ మటుమాయమౌతాయి. భక్తిమార్గంలో భగవంతునితో అనుసంధింపబడాలంటే మనం అనుసరించాల్సిన మార్గాన్ని గురించి ఆదిశంకరులు ఇట్లా అన్నారు.
''ప్రాప్నోతీహి యథా తథా పశుపతే: పాదారవిందద్వయం||''
మన చిత్తాన్ని ఈశ్వర పాదపద్మములపై ఎలా లగ్నం చేయాలనే విషయంపై రెండు ఉదాహరణలు మామూలుగ చెప్పబడతాయి. మన మనస్సులు ఈశ్వర పాదపంకజాలపై నిలిపితేనే భక్తి సార్ధకమవుతుందని ఆదిశంకరుల అభిభాషణ.
పైన నుడివిన వాటిలోని మొదటి ఉదాహరణ, మర్కట, కిశోరం, దాని తల్లిని గురించింది. తల్లికోతి ఒక చెట్టునుండి మరొక చెట్టు మీదకు, ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మ మీదకు ఎగురుతుంది. తల్లికోతి ఎగురుతున్నంతసేపు దానిపిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకొని పడకుండా సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ తన రక్షణ బాధ్యతను మర్కటకిశోరమే వహించి తన తల్లి పొట్టను వదల కరచుకొని ఉంటుంది. దీనినే మర్కట కిశోరన్యాయ మంటారు. అదేవిధంగా మనం పరమాత్మునికి దగ్గరగా అనుబంధితులమైతే ప్రపంచంలో ఎక్కడ విహరించినా కష్టాలకు గురికాము.
పై ఉదాహరణలోని మర్కట వృత్తాంతం మరియొక విషయంలో కూడ ప్రాధాన్యత వహిస్తుంది. మన మనస్సు కూడా మర్కటం వలెనే ఒక విషయం నుండి మరొక దానివైపు విహరిస్తూ ఉంటుంది. అలాకాక మనస్సును నియంత్రించి పరమేశ్వరుని పాదపంకజాలపై స్థిరీకరించగలిగినచో అది నిలకడ స్థితిని పొందుతుంది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు.
''తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం''
మర్కటకిశోరం తల్లికోతిని కరచుకొని యున్నట్లుగనే, మనం దేవదేవుని పాదపద్మాల్ని ఆశ్రయించి వదలకుండా పట్టుకొనియున్నచో మనకు సంభవించే కష్టారిష్టాలను అధిగమించి సర్వశ్రేయస్సులను పొందగలం.
రెండవ ఉదాహరణగా మార్జాలం దాని పిల్లల విషయం చెప్పబడింది. పిల్లి పిల్లలను కని వానిని అమిత జాగరూకతతో సంరక్షిస్తుంది. ఎవరినీ దాని సమీపానికి కూడ రానీయదు. అదేవిధంగా భగవంతుడు తన భక్తుల్ని అమిత శ్రద్ధతో సంరక్షిస్తాడు. వానికి ఎవరివల్లను హానిజరగకుండా కాపాడుతాడు.
మార్జాలం తన పిల్లలకు ఏమైనా కీడు జరుగుతుందని శంకిస్తే తనువున్న ప్రదేశాన్ని వదిలి పిల్లల్ని నోటకరుచుకుని మరియొక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తుంది. మానవుల విషయంలో కూడా భగవానుడు తన భక్తునికేదైనా విపత్తు సంభవిస్తుందని తలస్తే వానిని రక్షించి సురక్షిత ప్రదేశానికి తీసుకొని వెళ్తాడు. ఈ విధంగా మనం పరమాత్మునియందు అచంచల భక్తిని ప్రదర్శిస్తే, పిల్లి తల పిల్లల్ని రక్షించినట్లు మన పూర్తి రక్షణ బాధ్యతను ఆయనే వహించి మనకు అండగా నిలుస్తాడు.
ప్రస్తుతం మనముందు జరిగే ప్రతి కార్యాన్నీ మనమే నిర్వహిస్తున్నామని, భగవంతుని ప్రమేయం ఏమీలేదని విర్రవీగుతున్నాం. అందువల్లనే మనకు అన్ని విషయాల్లోనూ కొరత ఏర్పడుతోంది. తాగటానికి నీటి కొరత, తినటానికి ఆహారం కొరత, కరువులు, కాటకాలు, వర్షాభావం, వ్యాధులు అన్నీ ఏర్పడుతున్నాయి. మనకు మంచి సంభవించినప్పుడు ఇది అంతా మా ప్రయోజకత్వమేనని చాటుకుంటాం. పరమాత్ముని కృపవల్ల ఆ మంచి జరిగిందనే ఆలోచనే రాదు. కానీ మనకు కీడేదైనా వాటిల్లితే, వెంటనే దానికి కారణం భగవంతుడేనని ఆయన్ని నిందిస్తాం. ఇది చాల సహజమైన మానవ ప్రకృతి. అర్జునుడు గీతలో చెప్పినట్లు మన మనస్సు చంచలమైంది. పలు విషయాలపై విహరిస్తుంది.
''చంచలం హి మన: కృష్ణ''
ఎల్లవేళల పలువిషయాలపై సంచరించే స్వభావం గల మనస్సును నియంత్రించి భగవంతుని పాదాలవద్ద స్థిరీకరించాలి. ఈ విధంగా ఈశ్వరభక్తిని పెంపొందించుకొని పరమాత్ముని నిజతత్వాన్ని, ఆయన పాదపద్మాల్ని స్మరించాలి.
తర్వాత ఈ సందర్భంలో భ్రమరకీటక న్యాయంగా ప్రకటింపబడుతున్న ఉదాహరణను పరిశీలిద్దాం. కందిరీగ ఒక చిన్న కీటకాన్ని పట్టుకుని ఒక మట్టి గూటిలో ఉంచి దాన్ని మాటిమాటికీ కుడుతూ వుంటుంది. అలా కొంత సమయం గడిచాక కీటకం భయంలో చిక్కుకుని, తానే కందిరీగ లేక భ్రమరంగా మారుతుంది. అదేవిధంగా భగవత్కృప మనపై నిర్విరామంగా ప్రసరిస్తే, కందిరీగచే కుట్టబడిన కీటకం భ్రమరంగా పరిణమించినట్లే మన కూడ భగవత్స్వరూపాన్ని పొందగల్గుతాం.
త్రికరణశుద్ధిగా అంటే మనోవాక్కాయ కర్మలతో భగవన్నామస్మరణను కనీసం రోజులో అరగంట లేక పదిహేను నిముషాలు చేస్తే భగవత్స్వరూపాన్ని పొందగల్గుతాం. మన చెవులతో ఒక విషయాన్ని వింటాం. కనులతో చూస్తాం. ఐనా మన మనస్సు ఆ విషయంపై లగ్నమైయుండదు. పరిపరి విషయాలపై సంచరిస్తూ ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలు ఐదింటిని కనీసం ఒక నిముషమైనా భగవత్పాద పంకజములపై కేంద్రీకృతం చేయగల్గితే మనకు సత్ఫలితాలు అనేకం సిద్ధిస్తాయి. భక్తుడు భక్తిధ్యానంలో రోజంతా గడపనవసరంలేదు. త్రికరణశుద్ధితో కొద్ది కాలమైనా భగవధ్యానంలో గడిపితేచాలు, మన బాధలు, కష్టాలు పటాపంచలైపోతాయి.
ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయమేమంటే మనమందరం పరమాత్ముని దగ్గరనుండి వస్తాం. తిరిగి అక్కడికే చేరుకుంటాం. భగవంతుని చేరడానికి చాలా మార్గాల్లో భక్తి ఒక్కటియైనా అన్నింటిలోకీ సులభమైనది. అంకోలా విత్తనం చెట్టుకు జన్మిస్తుంది. అది క్రింద పడుతుంది. తిరిగి అదే చెట్టుకు చేరుతుంది. అలాగే నదులు పర్వతముల పైభాగాల్లో చేరిన నీటినుండి ఉద్భవిస్తాయి. సముద్రంలోని నీరు ఆవిరిగా మారి, ఆవిరి మేఘాలుగ ఏర్పడి అవి వర్షించగా వచ్చిన నీరే కొండపైభాగాల్లోని నీరు. కనుక నదులు సముద్ర జలాల ద్వారా తమ పుట్టుకను సాధించి మరల చివరకు సముద్ర జలాలనే చేరతాయి.
అదేవిధంగా ఒక పతివ్రత అయిన స్త్రీ తన భర్తతో ఎల్లప్పుడూ నడిపే సహజీవనంలోనే పరిపూర్ణ సౌఖ్యాన్ని, సంతృప్తిని అనుభవిస్తుంది. అంతేగాక భగవత్సాన్నిధ్యంలో వ్యక్తి దైవం నుంచి శాంతి దమనాల ప్రసరణను పొందుతాడు. ఉదాహరణకు అమితవేగంతో, భీకరస్వనంతో ప్రవహించే నదులు కూడ ప్రశాంతతను, నిలకడస్థాయిని సమకూర్చుకొని సాగరసంగమం కావించి దానిలో ఐక్యమవుతాయి. సముద్రం కూడ నదులకు ప్రేమతో స్వాగతం చెబుతుంది.
భక్తియొక్క పరమావధి ఆత్మ సాక్షాత్కారమే గనుక ఆ గమ్యాన్ని నిజమైన భక్తుడు ఉత్కృష్టభక్తి ద్వారా సాధిస్తాడు.
నిజమైన భక్తుని వచనాల్లో ''మదీయం ఏవ స్వరూపం దేహి.'' ఆత్మజ్ఞానం అనగా నీవే. దాన్నే నాకు ప్రసాదించు. ఆత్మజ్ఞానం అనే గమ్యాన్ని చేరటానికి భక్తి ఒక సాధనం. దానినే స్వస్వరూప అనుసంధానం అంటాం. గమ్యాన్ని స్వస్వరూప అవబోధ అంటాం.
కనుక ప్రతివారు ప్రాత:కాలంలో లేచి, కాలకృత్యాలు నెరవేర్చి, భగవద్ధ్యానం చేసి సన్మార్గానుసారులై, సనాతన ధర్మాన్ని పాటించాలి. సగుణరూపంలో పరమాత్మునియందు భక్తిని పెంపొందించుకొని, సర్వకాల సర్వావస్థలయందు భగవంతునే స్మరిస్తూ వ్యక్తి జీవించాలి. అలాచేస్తే అతనికి సర్వశ్రేయస్సులు లభిస్తాయి. అతని జీవితం సుఖమయ మౌతుంది.
(జయేంద్రవాణి గ్రంధమునుండి సేకరించబడినది)