తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఉదయం 11.30 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 7.30 గంటల వరకు బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి అమలుచేయనుంది. ప్రోటోకాల్‌ విఐపిలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్‌ దర్శనాన్ని టిటిడి ప్రవేశపెట్టింది.

ఉదయం బ్రేక్‌ దర్శనానికి రావాలనుకునే ప్రోటోకాల్‌ విఐపి భక్తులు ఉదయం 8 గంటలకు, సాయంత్రం బ్రేక్‌ దర్శనానికి రావాలనుకునే భక్తులు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ ఏఈవో కార్యాలయంలో (పీఏసీ సమీపంలో) సూచించిన నమూనా పత్రంతోపాటు ఆధార్‌ కార్డును జతచేసి అందజేయాల్సి ఉంటుంది. బ్రేక్‌ దర్శనం టికెట్‌ ధర రూ.250/-గా నిర్ణయించారు. వీరికి హారతి, తీర్థం, శఠారి ఉంటుంది. కుంకుమార్చన మధ్యాహ్నం 1 గంట నుండి 4.30 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది.

తిరుచానూరు ఆలయం తెరచు వేళలు


తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఇకపై అరగంట ముందుగా అనగా ఉదయం 4.30 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటలకు బదులు 9.30 గంటలకు మూస్తారు. సాధారణ భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా ఒక గంట పాటు బ్రేక్‌ దర్శనాన్ని అమలు చేసేందుకు ఈ మేరకు ఆలయ వేళల్లో మార్పులు చేశారు.

బ్రేక్‌ దర్శనం, కుంకుమార్చన సేవ తరువాత ప్రోటోకాల్‌ విఐపిలు రూ.100/- టికెట్‌ కొనుగోలు చేసి అమ్మవారిని లఘు దర్శనం చేసుకోవచ్చు. సాధారణ భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రోటోకాల్‌ విఐపిలు సహకరించాలని టిటిడి కోరుతోంది.

Source