ఈ కల్కి జయంతిని ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో నిర్వహిస్తారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర, శ్రీరంగంలోని రంగనాధస్వామి, ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, గురువాయూర్ లోని కృష్ణ ఆలయం, భద్రాచలం లోని శ్రీ రామచంద్రమూర్తి ఆలయం తదితర ఆలయాల్లో నిర్వహిస్తారు.
కల్కి అవతారాలు 27
కల్కి అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది కనుకనే వేదవ్యాసుడు కల్కి అవతారం గురించి ప్రస్తావించాడని శ్రీమద్భాగవతం ప్రకారం తెలుస్తోంది. ప్రతి మన్వంతరంలో 71 చతుర్యుగాలు వస్తాయి, అంటే 71 కలి యుగాలు. అందులో మనం ఉన్నది 28వ కలియుగం, అంటే 27 కల్కి అవతారాలు ఇది వరకే వచ్చాయని పురాణం చెబుతుంది.
ఇంకో కథనం కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కల్కి అవతారమున "విష్ణుయశస్సుడు" అనే పేరుతో బ్రాహ్మణకులములో జన్మిస్తాడని, హయగ్రీవుడికి వలె ఇతనికి కూడా గుఱ్ఱపు ముఖము ఉంటుందని, చేతిలో ఖడ్గముతో, తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని వివరణ.
కల్కి అవతారం దోషమును హరిస్తుంది
కల్కి అవతారం అన్న పేరు కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక ఆపేరు వచ్చిందని ఒక భావన. కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి.
"అవతారం" అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన (అవతరించిన) రూపం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి. మొత్తం 25 అవుతాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం "ధూమకేతువు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు" మూర్తిగా వర్ణిస్తారు.
పద్మ పురాణం ప్రకారం కల్కి దేవుడు కౄరులైన మ్లేచ్ఛులను సంహరించి, విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు. వారి క్షుధార్తిని పరిహరిస్తాడు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు.