రామాయణాన్ని గురించిన మానవుని అనుభూతి కూడ ఇదేవిధంగా ఉంటుంది. రామాయణ ప్రవచనాలు మనం ఎన్నోమార్లు విన్నా, అలాగే రామాలయాలకు వెళ్ళి రామచంద్రమూర్తిని పలుమార్లు సందర్శించినా మనం సంతుష్టి చెందము. మనం ఇతర కథలేవైనా విన్నప్పుడు విసుగు కలిగినట్లు రామాయణగాథను ఎన్నిసార్లు విన్నా విసుగుపుట్టదు. నిజంగా రామాయణమనే మహాసముద్రంలో మునిగి దేవులాడాలి గాని అమూల్యమైన రత్నాలు, ముత్యాలు అసంఖ్యాకాలుగా కనుగొనవచ్చు. ఎనలేని ఆనందాన్ని పొందవచ్చు.
శ్రీకృష్ణుని గాఢమైన అనుబంధం కారణంగా బృందావనం, మధుర పట్టణాల్లో భాగవతానికి అమిత ప్రాముఖ్యమున్నది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోను గర్వించదగ్గ స్థానం రామాయణానికి ఉంది. కొన్ని కార్యాలను నిర్వర్తించుటకు, తాను భక్తులకు ప్రసాదించిన వరాలను పరిపూర్తిచేయుటకు, భగవానుడు ఈ ప్రపంచంలో అవతరిస్తాడు. వైకుంఠవాసియైన పరమాత్ముడు ఈ భూమిపై జన్మించి సామాన్య మానవుని వలె మనమధ్య జీవిస్తాడు. రామావతారం అలాంటి అవతారాల్లో ఒకటి. విష్ణువు యొక్క అంశమే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నాల్గు రూపాలుగా విభజింపబడినది.
విష్ణువు రావణ సంహారం కొరకే రామునిగా అవతరించాడు. రావణుడు భగవానుని ఒక ప్రత్యేకమైన వరాన్ని కోరాడు. ''ఏ దేవతగాని, ఇంద్రుడు గాని, ఈశ్వరుడు గాని, పరమాత్ముడే గాని నన్ను చంపకూడదు'' అని. మృత్యువునెవ్వడూ నివారింపలేడు. ఏదో సమయంలో అది వచ్చి తీరుతుంది. రావణుడు అమిత పరాక్రమవంతుడు గనుక మానవుని గురించి అతడు భయపడలేదు. కనుకనే మానవుడు తప్ప ఇంకెవ్వరూ తనను సంహరించకుండా వరాన్ని పొందాడు.
ఇంద్రాది దేవతలకు రావణుడంటే సింహస్వప్నం. పంచభూతాలు కూడ రావణుని ఆజ్ఞమేరకు వర్తించాయి. ఋషులు, సన్యాసులు అతడంటే భీతావహులైనారు. రావణుడు మర్త్యుని చేతిలో మాత్రమే చంపబడాలి గనుక పరమాత్మ మానవుడుగా అవతరించాడు.
కనుక రామాయణంలో రాముడు ఆదినుండి తుది వరకు మానవ ప్రకృతినే అనుసరించాడు. అతడు అడవికి వెళ్ళి మహర్షులను దర్శించినప్పుడు వారందరూ ఆయన్ని భగవానునిగా భావించి, కీర్తించి మ్రొక్కుతుంటే రాముడు వారిని వారించి ''నేను మర్త్యుణ్ణి, సామాన్య మానవుణ్ణి, దశరథుని యొక్క పుత్రుణ్ణి'' అని చెప్పుకునేవాడు.
''ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం.''
నేను భగవంతుణ్ణి కాదు, సాధారణ మానవుణ్ణి అని రామాయణంలో రాముడు అనేక సందర్భాల్లో చెప్తాడు. రావణ వధానంతరం దేవతలందరూ ఆనందభరితులై రాముణ్ణి కీర్తించినప్పుడు కూడ రాముడు తానొక సాధారణ మర్త్యుడననే పదే పదే చెప్తాడు. కాని శ్రీకృష్ణుడలా కాదు. బాల్యంలో ఆయన జరిపిన లీలలే ఆయన మానవ మాత్రుడు కాదని, భగవత్స్వరూపుడేయని నిర్ధారించడానికి సరిపోతాయి. చాలా సందర్భాల్లో తనంత తానుగా భగవానుని అవతారమని ప్రకటించుకున్నాడు. ఉదాహరణకు గీతలో ఆయన చెప్పించి చూడండి.
శ్లో || అవజానంతి మాం మూఢా: మానుషీం తనుమాశ్రితం |
పరం భావం అజానంత: మమ భూతమహేశ్వరం ||
శ్రీకృష్ణుని యొక్క చర్యలు కూడ ఆయన పరమాత్ముడేనని ఋజువు చేస్తాయి. రాముని చర్యలు ఎక్కువ మానవ కృత్యాలుగానే పరిగణింపబడతాయి. అందువల్లనే 'రామునివలె జీవించు, కృష్ణుని ఉపదేశాలు అనుసరించు' అని పెద్దల వాక్యం. మనం కృష్ణుని వలె జీవించలేం. తనను సంహరించడానికి వచ్చిన పూతన అనే రాక్షసిని చంపటం కృష్ణుడు తన బాల్యంలో చేసిన మొదటి అద్భుతం. మర్త్యుడైన ఏ పిల్లవాడు దీనిని సాధించగలడు? అంతేకాదు. యశోద మందు తన నోటిని తెరచి విశ్వరూప సందర్శనాన్ని ఇస్తాడు. ఇవన్నీ మానవాతీత చర్యలే. కృష్ణుడు మాత్రమే వానిని ప్రదర్శించే మహిమగలసమర్ధుడు.
మరి రాముడు కష్టకాలంలో సాధారణ మానవుని వలె బాధల్ని అనుభవించాడు. పితృసేవలను, మాతృసేవలను, మానవ సేవను నిర్వర్తిస్తూ మామూలు మనిషి వలె జీవించి మాతృభక్తిని, పితృభక్తిని అత్యున్నత స్థాయిలో ప్రదర్శించాడు.
రామాయణంలో ఇలా చెప్పబడింది.
శ్లో|| ''రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా |
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||''
రాముడు స్వధర్మాన్ని అవలంబిస్తూ తన కుటుంబాన్ని కూడ సంరక్షించుకున్నాడు. కొంతమంది స్వధర్మ పరిపాలన కొరకు కుటుంబ రక్షణ బాధ్యతను విడనాడుతారు. ప్రపంచంలోని సర్వప్రాణులను విచక్షణారహితంగా కాపాడాడు. జటాయువు అనే పక్షిని సహితం కాపాడి దానికి మోక్షాన్ని ప్రసాదించాడు. యావత్సంఘంపట్ల తనకున్న అతీతధర్మాన్ని కూడ సంరక్షించుకున్నాడు.
రామరాజ్యం ఎలా ఉండేదో రామాయణంలోని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది.
శ్లో|| ''రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా: |
రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి ||''
రాముడు రాజ్యమేలుతున్నప్పుడు ప్రజలందరు ఆయన పరిపాలనను మెచ్చుకుని కీర్తించుచు ఎల్లవేళలా రామునే స్మరణచేసేవారు. ప్రజలందరూ ఆయన ధర్మపరిపాలనలో సుఖశాంతులతో వర్థిల్లారు. అసంతృప్తి చెందిన మనుజుడే లేడు. ఏ నోటవిన్నా రామనామ జపమే. ఆయన ఖ్యాతిని, పరిపాలనలో ఆయన సాధించిన ప్రజోపయోగమైన సత్ఫలితాల్ని మెచ్చుకోని వారులేరు. 'రమయతీతి రామ:' రమింపచేసేవాడే రాముడు. రాముడు సర్వజనులకు తన పరిపాలన ద్వారా సుఖాన్నొసగి తనియజేసేవాడు. ప్రజలు రామస్వరూప భావనలో తన్మయులై సర్వకాల సర్వావస్థలయందు రామనామాన్నే జపించేవారు.
''న ప్రదోషే హరింపశ్యేత్ నృసింహంరాఘవంవినా||''
పై వచనాన్ని బట్టి ప్రదోషకాలంలో రుద్రుని లేక పరమేశ్వరుని మాత్రమే దర్శించాలి, హరిని మాత్రం కాదు. కాని నృసింహుడు ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపునకు ఇచ్చిన వరం ప్రకారం ఆ ఆకృతిలో ప్రదోషకాలంలో అవతరించాడు కనుక ప్రజలు ఆయనను కూడ ఆ కాలంలో స్మరించవచ్చు. రామనామం సుఖానికి సంకేతం గనుక ఆయన్ని కూడ ప్రదోషకాలంతో సహా అన్ని వేళలా స్మరించవచ్చు. రామస్వరూప చింతనకు వేళలను గురించిన అభ్యంతరాలు ఏమీ ఉండవు గనుక రాముని అన్నివేళల స్మరించవచ్చు.
కాశీక్షేత్రంలో భగవాన్ విశ్వనాథుడు తన భక్తులకు తారకమంత్ర ఉపదేశాన్ని ఎల్లవేళల వారి కుడిచెవిలో యిస్తారు. ఆ కారణంచేత కాశీ ముక్తికి కేంద్రస్థలిగా
ప్రసిద్ధి కెక్కింది. రాముడు సుఖాల్ని సర్వులకు ప్రాప్తింపచేస్తాడు గనుక కాశీలో ఈశ్వరుడు సహితము రామనామ జపం చేస్తాడు. రామనామ ఉపదేశాన్ని ఒక పర్యాయం శ్రవణం చేస్తే చాలు మన బాధలన్నీ ప్రక్షాళింపబడతాయి. అంతేకాదు భగవాన్ విశ్వనాధుడు రామనామ ఉపదేశాన్ని ఎల్లవేళల మన కుడిచెవిలో ఇస్తారు. దానివలన మన బాధలన్నీ అంతరించి సుఖప్రాప్తి ల్గుటయే కాక, క్రమముక్తి ద్వారా వైకుంఠం చేరటానికి మార్గం సుగమమౌతుంది. రామా యణంలో చాల ధర్మాలు విశదీకరింపబడ్డాయి. సీతాదేవి అనుసరించిన స్త్రీధర్మాన్ని గురించి ఇలా చెప్పబడింది.
''ఛాయేవానుగతా సతీ''
స్త్రీధర్మంలోని చాలా అంశాలు రామాయణంలో ముఖ్యంగా సీతాదేవి జీవితం ద్వారా నిరూపింపబడి పరిష్కరించబడ్డాయి. రామునితోబాటు సీతకూడ అడవికి వెళ్ళింది. ఆమెను అడవికి పొమ్మని ఎవ్వరూ ఆజ్ఞాపించలేదు. రాముడే ఆమెను వలదని వారించాడు. రాజభవనంలోనే ఉండి తన తల్లిదండ్రులకు సేవ చేయమన్నాడు. అయినా సీత రాముననుసరించి అడవికి వెళ్ళుటకే నిశ్చయించింది. ఈ విషయం మనకు స్త్రీధర్మాన్ని అతి రమణీయంగా చిత్రీకరిస్తుంది.
మనిషి, మనిషి యొక్క ఛాయ భిన్నములైనా అవి విడదీయరానివి. అదేవిధంగా రాముడు అడవికి వెళ్ళగా సీత ఆయన నీడగా ఆయనను అనుసరించింది. ఆమెనెవరూ వెళ్ళమని బలవంతపెట్టలేదు. నిజానికి ఎక్కువమంది ఆమె ప్రయాణాన్ని నిరోధించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతంసంఘంలో దానికి విపర్యంగా విషయాలు జరుగుతున్నాయి. మగనికి ఉద్యోగంలో మరొక ఊరు బదిలీయైతే భార్య భర్తననుసరించక, భర్తను మాత్రమే పంపి తానచ్చటనే ఉండుటకు నిశ్చయిస్తోంది.
అనసూయ యొక్క ఆశ్రమంలో అనసూయ సీతను తన వివాహవేడుకలను గురించి వివరించమని అడిగినప్పుడు సీతవానిని విశదీకరిస్తుంది. ఆ సందర్భంలో అనసూయ సీతకు భర్త కష్ట సమయంలో ఉన్నప్పుడు భార్య భర్తతో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. పరిస్థితులు బాగున్నప్పుడు భార్య, భర్తతో ఉల్లాసంగా మెలగవచ్చు. కాని అతనికి దుర్దశ ప్రాప్తించినప్పుడే సమస్య ఎదురౌతుంది. కష్టసమయంలో ఉన్న తన భర్తతో అడవిలో తాను సహచరించుటకు ఆవశ్యకమైన విశేష ధర్మాల్ని గురించి అనసూయ వివరించింది.
శ్లో|| సాంత్వయన్తీ అబ్రవీత్ హృష్టా దష్ట్యా ధర్మమవేక్షసే |
త్యక్తా జ్ఞాతిజనం సీతే మనమృద్ధిం చ భామిని ||
అవరుద్ధం తనే రామం దిష్ట్యా త్వమను గచ్ఛసి |
నగరస్థో వనస్థో వా శుభో వా యది వాశుభ: ||
యాసాం స్త్రీణాం ప్రియో: భర్తాం తాసాం లోకా మహోదయా|
దు:శీల: కామవత్తే వా ధర్మోవా పరిర్వాజత:
స్త్రీణా మార్యస్వభావానాం పరమం దైవతం పతి: ||
రామాయణంలో స్నేహ ధర్మాల్ని గురించి కూడా అభివ్యక్తీకరింపబడింది. సౌహార్ద్రతకు మంచి ఉదాహరణగా క్షీరానికి, నీటికి మధ్య ఉన్న స్నేహశీలతను చెప్తారు. పాలు, నీరు కలిసియున్న పాత్రను పొయిపై నుంచి వేడిచేసినప్పుడు కొంతసేపటికి వేడివల్ల పాలు పొంగి అగ్నిలో పడతాయి. పొంగుతున్న పాలపై నీటిని జల్లినంతనే పొంగు ఆగి పాలు అగ్నిలో పడకుండగా ఆగుతాయి. అలా పాలు అగ్నిలో పడి దహింపబడకుండా నీరు సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో క్షీరం, నీరు తమ మధ్యవున్న స్నేహశీలతను ప్రదర్శిస్తాయి. దీనినే భర్తృహరి క్రింది శ్లోకంలో చెప్తాడు.
శ్లో|| క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తా: పుణత్యే ఖిలా:
క్షీరేతాపమవేక్ష్య తేన పయసా హ్యాత్మాకృశానౌ హూత:|
మతుం పావక మున్మవదభవత్ దృష్టా ళు మిత్రవిపత్తి యుక్త:|
తేన జలేన శామ్యతి సతా మైత్రీ పుస్త్వీదృశీ ||
ఆదర్శవంతమైన స్నేహం ఎలా ఉండాలో ఈపై ఉదాహరణ మనకు స్ఫురింపచేస్తుంది. మామూలుగా జీవితంలో కూడ మనం సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితులు మన చుట్టూ మూగుతారు. కాని మనకు దుర్దశ ఏదైనా సంభవించిందని తెలియగానే వారందరూ మనల్ని వదిలి దూరమౌతారు. ఇది నిజమైన స్నేహలక్షణం కాదు. మన అవసరానికి అక్కరకు వచ్చే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. ఆపద సమయమే నిజమైన స్నేహాన్ని ఋజువు పరుస్తుంది. నిజమైన స్నేహం నీరు, పాల మధ్యవున్న స్నేహంవలె ఉండాలి.
పూర్వకాలంలో క్షత్రియుల్లో భర్త మరణించినప్పుడు భార్య భర్త చితిపై పడి భర్తతో సహగమనం చేసే ఆచారముండేది. స్త్రీ తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవడం మనదేశంలో మాత్రమే కన్పిస్తుంది. రామాయణంనిత్యజీవితానికిఒక మార్గదర్శి రామాయణంలో స్త్రీధర్మం, స్నేహధర్మం కూడ విపులంగా ప్రదర్శింపబడ్డాయి.
భరత, లక్ష్మణులలో రామునిపై ఎవరికి ఎక్కువప్రీతి? లక్ష్మణుడు ఎల్లప్పుడు రామునితోనే ఉండేవాడు. కాని భరతుడెప్పుడూ రామునికి దూరంగా ఉండి ఆయన నియమించిన కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవాడు. రాముడు అడవికెళ్ళగా భరతుడు ఆయన తరపున ఆయన పాదుకల్ని సింహాసనంపై ప్రతిష్ఠించి నంది గ్రామంలో వుండి రాజ్యపాలన నిర్వహించాడు. రాముడు అడవుల్లో అష్టకష్టాలకు గురియౌతున్నాడు గనుక తానుకూడ సర్వసౌఖ్యాల్ని త్యాగం చేయటానికి నిర్ణయించుకున్నాడు. అది ఆయనలో వున్న విశేష లక్షణం. అది లక్ష్మణునిలో కన్పించదు. కాని లక్ష్మణుడు తన జీవితమంతా రాముని సహచర్యంలోనే గడిపి ఆయనకు నమ్మినబంటుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా ఆ అన్నదమ్ముల సౌభ్రాతృత్వం రామాయణంలో ప్రకటింపబడింది. ఇంకా రామాయణంలో సేవాధర్మం అతిమనోహరంగా విశదీకరింపబడింది. అనన్యాదృశమైన ఆంజనేయుని సేవానిరతి రామాయణగాథలో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నదిఙ