బోనాలు 2022: మహిమాన్వితమైన ఉత్సవాలు మహంకాళి బోనాలు


బోనాలు...అమ్మా బైలెల్లినాదే...తల్లీ బైలెల్లినాదే అంటూ భక్తుల పాటలు, పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలు...ఘటాల ఊరేగింపు, రంగం భవిష్యవాణి..ఫలహారాల బండ్లు ఊరేగింపులు, లక్షలాది మంది భక్తుల పూజలు వెరసి లష్కర్‌ బోనాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి.

ఆలయ చరిత్ర

బోనాలు ఉత్సవం నిర్వహించే సికింద్రాబాద్‌లో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారి  ఆలయానికి ఉజ్జయిని అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇక్కడున్న అమ్మవారి ఆలయాన్ని 1813లో బ్రిటిష్‌ సైన్యంలో పనిచేసే సికింద్రాబాద్‌ వాస్తవ్యులు సూరిటి అప్పయ్య గారు నిర్మించారు. ఆ రోజుల్లో భాగ్య నగరంలో ప్లేగు వ్యాధి తీవ్రంగా ఉండేది. అయితే అప్పయ్యగారు తన ఉద్యోగ బదిలీల్లో భాగంగా సికింద్రాబాద్‌ నుంచి మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారు. సికింద్రాబాద్‌లో ప్లేగు వ్యాధి నిర్మూలించ బడాలని ఉజ్జయిని అమ్మవారికి మొక్కులు మొక్కుకున్నారు. ప్లేగువ్యాధి బారినుంచి నగర ప్రజలు రక్షింపబడితే అమ్మవారికి ఆలయం కట్టిస్తానని చెప్పారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే ప్లేగువ్యాధి నశింపబడింది. ఆ కారణంగా అప్పయ్యగారు మొక్కిన మొక్కుకు గానూ ఆలయం కట్టించారు. సూరిటి అప్పయ్యగారు, ఆయన అనుచరులు ప్రస్తుతం ఉన్న ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని 1815లో కర్రతో తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రతి రోజూ అమ్మవారిని భక్తితో కొలిచేవారు. ఈ క్రమంలో ఆలయం వద్ద బావి తవ్వుతుండగా వారికి మాణిక్యాలదేవి విగ్రహం దొరికింది. ప్రస్తుతం ప్రధాన ఆలయంలో మాణిక్యాలదేవి విగ్రహం ఉంది. మాణిక్యాలమ్మ కోరికమేరకు అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్టింపచేశారు. లష్కర్‌లో కొలువు తీరిన ఉజ్జయిని మహంకాళి చల్లని చూపులు తమమీద ప్రసరించాలని...ఆ తల్లి కరుణా కటాక్షాలు తమ మీద ఉండాలని...అమ్మవారికి బోనం సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనీ...అనాదిగా భక్తుల నమకం.

దేవి తన పుట్టింటికి వెళుతుందని...

బోనాలు ఎందుకు సమర్పిస్తారంటే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు ఇంకా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఏటా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జూలై లేదా ఆగష్టు నెలల్లో ప్రవేశించే ఆషాఢ మాసంలో ఈపండుగ జరుపుకుంటారు.

బోనాలంటే...

బోనాలు అంటే భోజనం అని అర్థం. ఇది దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్లతో ఊరేగింపుగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేదా కడి అనిపిలిచే తెల్లముగ్గుతో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం అనాదిగా వస్తున్న పద్దతి. బోనాల సందర్భంగా మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం(నైవేద్యం కుండ) మోస్తూ లయబద్ధమైన డప్పు మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నాట్యం చేస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంత పరచడానికై మహిళలు ఆలయాన్ని సమీపించే సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబందమూ కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాలు వేడుక ఇలా...

బోనాలు పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్‌ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్‌ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు వున్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి.

హైదరాబాద్‌ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభ మవుతాయి. ఆషాఢ మాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. ఏటా జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి. అత్యంత మహత్యమైన వేడుకైన బోనాల పండుగ పరంపరలో చోటుచేసుకునే పలు అంశాలు మనందరికీ భక్తి పారవశ్యంలో ముంచేస్తాయి.

పోతురాజు

బోనాలు తీసుకుని వచ్చే సమూహాన్ని దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి  స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటాడు. ఉత్సవంలోని భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద పోతురాజు నాట్యం కొనసాగుతుంటుంది. పోతురాజు పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు.

కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు. పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాన్ని తగ్గించేెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల,మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు దీనినే గావు పెట్టడం అని పేర్కొంటారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

విందు భోజనాలు

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం ఆవిష్కరింపబడుతుంది.

ఘటం

బోనాలు సమయంలో అమ్మవారి ఆకారములో అలంక రింపబడిన రాగి కలశాన్ని సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి మోస్తాడు. ఈ కలశాన్నే ఘటం అంటారు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్‌ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్‌ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌ దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌ షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదు లోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్‌ బేలాలోని ముత్యాలమ్మ ఆలయాలు పాల్గొంటాయి.

జాతరలో ప్రధాన ఘట్టం రంగం

బోనాలు జాతరలో ప్రధాన ఘట్టం రంగం. సంవత్సరమంతా తమకు ఎలా గడుస్తుందో, ఏయే విపత్తులు తమను చుట్టుముట్టనున్నాయో తెలుసుకోవటానికి ఎరకలివాండ్లతో, కోయదొరలతో భవిష్యత్తు చెప్పించుకునేవారు. అలాగే జాతర భవిష్యవాణికి ఓ ప్రత్యేకత ఉంది. కుమ్మరిచేత అప్పుడే మట్టికుండను చేయించి దానిపైన అమ్మవారిని ఆవహించిన అవివాహిత చేత భవిష్యవాణిని చెప్పించటం ఏళ్ళతరబడి వస్తోంది. ఆ ఏడాది దేశ రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు, మంచిచెడ్డలను మహంకాళి అమ్మవారు ఆవహించిన స్వర్ణలత చెప్పిన తర్వాత ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇచ్చి పూనకం విరమింపచేస్తారు. దీనితో ప్రధాన జాతర ముగుస్తుంది.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం తర్వాత అమ్మవారిని దేవాలయం నుండి సికింద్రాబాద్‌ పొలిమేర మెట్టుగూడ వరకూ సాగనంపటంతో సికిందరాబాద్‌ ఉజ్జయిని మహంకాళి జాతర ముగిసి మరో ఏడాదికి ఆహ్వానం పలుకుతుంది.