ఆషాడంలో వర్షాలు బాగా పెరిగి పొలం మడుల్లో నీరు చేరుతుంది. కొత్త నీరు కుళ్లిన చెత్త, కీటకాలతో నిండి ఉంటుంది. నీరు పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకూ శుద్ధి అవదు. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడప కుండా రోజు గడవదు. దీంతో పలు వ్యాధులు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఎక్కువగా చర్మవ్యాధులకు గురవుతాం, గోళ్లు దెబ్బతినడం వంటి సహజ మార్పులు గమనిస్తాం. గోరింటాకు ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీకుండా కొంతవరకూ ఆపుతుంది.
గోరింటాకులో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఈ మాసంలో వాతా వరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అను గుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింటాకు.
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు పుట్టింటికి చేరుకుంటారు. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. గోరింటాకు ఆడపిల్లల చేతులకు కోమలత్వాన్ని తెచ్చిపెడుతుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల అవి అందంగా ఉండడమే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా రక్షింపబడతాము.