శ్రీనివాసమంగాపురం: వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండవ రోజైన మంగళవారం  సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు పంచాంగ శ్రవణం చేపట్టారు. ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారి ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

జూలై 18న గరుడ సేవ


శ్రీనివాసమంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివరి రోజైన జూలై 18న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు.

Source