ఆషాడఅమావాస్య 2022: ఆషాడ అమావాస్య నాడు పాటించవలసిన నియమాలు

సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల్లో కెల్లా ఆషాఢానికి కొన్ని ప్రత్యేకతలు విశేషాలున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదని ఒక సంప్రదాయం. కానీ కొన్ని కార్యాలకు ప్రత్యేకంగా ఆషాఢమాసం దివ్యమైనదంటారు కూడా. 

గృహ నిర్మాణాలకు...

సంవత్సరంలో నాలుగో మాసమైన ఆషాఢంలో ఏదైనా శుభముహూర్తాన గృహ నిర్మాణం ప్రారంభిస్తే చేకూరే ఉత్తమ ఫలితాలను మత్స్య పురాణం పేర్కొంది. ఈ మాసంలోని గృహ నిర్మాణానికి భృత్య, రత్న పశువుల ప్రాప్తి ఫలితంగా ఉంది. 

బహుళ అమావాస్య

ఆషాఢమాసంలో చివరిరోజైన ఆషాఢ అమావాస్య దీపపూజకు ప్రత్యేకమైనది. ఉదయాన్నే శుచిగా స్నానం చేసిన అనంతరం ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందులు శుభ్రంగా కడగాలి. కొయ్య పలకలను లేదా పీటలను పేడతో అలికి దాని మీద ముగ్గులు పెట్టాలి. 

కుందెలు, దీపస్తంభాలు ఆ ఫలకం లేదా పీటలపై ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజ చేయాలి. లడ్డూలు, మోరుండలు నైవేద్యంగా నివేదించాలి. అంతేకాకుండా వాటిని ముత్తయిదువకు, బ్రాహ్మణుడికి వాయనం కింద అందచేయాలి. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపించాలి. అక్కడితో దీప పూజ పరిసమాప్తి అవుతుంది. ఇలా ఆషాఢమాసంలో దీపపూజ చేస్తే ఇంట్లో అష్టయిశ్వర్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.