'గురుర్బహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర :
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'
ఈ గురుపౌర్ణమి వెనుక ఒక విశిష్టత దాగి ఉంది. పురాణాల ప్రకారం పెద్దలు చెబుతున్న వివరాలను బట్టి పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. వీరికి సంతానం లేదు... సత్సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.
ప్రతిరోజూ మధ్యాహ్న సమయ మందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ఆనాటి నుంచి ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.
వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించు కుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా 'మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. అందు చేతనే మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను' అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.
రేపు నా తండ్రిగారి పితకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.
వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠుడైన ఆ ముని శ్రేష్టుడు ఓ పుణ్య దంపతులారా... మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.
'ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు' అని బదులు పలుకుతారు ఆ దంపతులు. అది విన్న మహర్షి 'త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగు తుందని' ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్య మున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించినచో ఆయన అనుగ్రహము పొందుతారు.
గురువు అన్నమాటకు చాలానే అర్థాలు వెతుక్కోవచ్చు. చీకటిలాంటి అజ్ఞానాన్ని పారద్రోలేవాడనీ, అధికుడనీ... ఇలా ఎన్ని తాత్పర్యాలనైనా విడదీయవచ్చు. ఎవరే అర్థాన్ని అన్వయించుకున్నా మానవులకు అవసరమైన జ్ఞానాన్ని అందించేవాడు గురువు అనడంలో ఎవరికీ ఏ సందేహమూ ఉండదు. అలాంటి గురువులలో ఉత్తమమైనవారు ఎవరంటే వేదవ్యాసుడూ గుర్తుకురాక మానడు. దక్షిణామూర్తి ఉదంత ము కూడా తలపులకు రాక మానదు.
వ్యాస మహాముని గురించి...
గురువు లకే గురువైన వ్యాస మహాముని గురించి గురుపౌర్ణమి సందర్భంగా తెలుసుకో వాల్సిందే... పరాశరుడు అనే ఋషికీ, సత్యవతి అనే జాలరి కన్యకీ పుట్టినవాడు వ్యాసుడు. అలా వ్యాసుని జననం కులరహితంగా ఏర్పడింది. నిజానికి వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆయనకు ఆ పేరు స్థిరపడిందంటారు. అప్పటివరకూ ఉన్న వేద సాహి త్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు 'వేద వ్యాసుడు'గా మారాడు. వేదవ్యాసుడు అనగానే మహాభారతం గుర్తుకు వస్తుంది.
వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. ఎందుకంటే వ్యాసుని కారణంగానే ధృత రాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మిం చారు. మరి వ్యాసుడు లేకపోతే కౌరవ పాండ వుల ఉనికే ఉండేది కాదు కదా మరి! పైగా వ్యాసుని తల్లి అయిన సత్యవతి, భీష్ముని తండ్రి అయిన శంతనుని వివాహం చేసు కుంటుంది. అంటే! భీష్ముని దగ్గర్నుంచీ భీముని వరకూ ప్రతి ఒక్కరూ వ్యాసునికి దగ్గరవారే.
వ్యాసుడు కేవలం భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ...యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ పురాణ గాధల ఆధారంగా మన పెద్దలు చెబుతారు. ఇక బ్రహ్మ సూత్రాలను రాసిన బాదరాయణుడు మరెవ్వరో కాదు, వ్యాసుడే అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అంటే హైందవ సంస్కృతి కి మూలమైన వాఙ్మయమంతా వ్యాసుని వల్ల ఒక కొలిక్కి వచ్చిందన్నమాట. అలాంటి వ్యాసుని గురు పరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టినరోజుని గురు వులను ఆరాధించుకునే పండుగగా నేడు మనం జరుపుకుంటున్నాము.
జగత్తుకే తొలిగురువు దక్షిణామూర్తి
గురువు ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారగలడు. కానీ ఎలాంటి గురువూ అవసరం లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించినవాడు ఆ పరమే శ్వరుడు ఒక్కడే! అందుకనే ఆయనను ఆదియోగిగా కొలుచుకుంటున్నారు. అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందు దామనుకుని ఎందరో ప్రయత్నించి విఫలమైనారట. కానీ ఒక ఏడుగురు మాత్రం పట్టు విడువకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. తమతో ఆయన ఒక్క మాట మాటలాడకున్నా గానీ సంవత్సరాల తరబడి ఆయన కరుణ కోసం వీక్షిస్తూ తపించిపోయారు.
శివుడు వారి పట్టుదలను పరీక్షిం చేందుకు దశాబ్దాల తరబడి వారికి ఎటు వంటి బోధా చేయలేదు. అయినా వారి పట్టు సడలనేలేదు. శివుని దివ్య సముఖంలో తపస్సుని ఆచరిస్తూ ఉండిపోయారు. చివరికి ఒక రోజున వారిని గమనించిన శివుడు, జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని గమనించాడు. అటుపై దక్షిణదిక్కుగా కూర్చుని వారికి ఉపదేశాన్ని అందించాడు. అలా శివుడు దక్షిణా మూర్తిగా, జ్ఞానానికి అధిపతిగా మారాడు. ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణ దిక్కు యమస్థానం! అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందించేందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారాడంటారు పెద్దలు.
తొలి నమస్కారం గురువుకే
గురువు గోవిందుడు ఎదురెదురుగా నిలుచుంటే నీవెవరికి నమస్కరిస్తావని కబీరుదాసును ప్రశ్నిస్తే నేను ముందు గురువుకే నమస్కరిస్తానని చెప్పారుట. ఇది మనలో చాలామందికి తెలుసున్న ఒక వాస్తవం. గురువుకి ఎంత మహిమ ఉంటుందంటే ఆయనకు బ్రహ్మరాతనే మార్చగల శక్తి ఉంటుందన్నది మన పెద్దల ద్వారా మనకు తెలిసిన నిజం. అంతటి మహిమగల గురువును మనసారా పూజించుకునే పర్వదినమే గురుపౌర్ణమి.
గురువు ను భగవంతునికి, మనకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తాం. వ్యాసభగవానుడు మానవజాతికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని వేదాల ద్వారా అందించిన మహానుభావుడు. అందుకే వ్యాస మహర్షి జన్మదినాన్నే ప్రతియేటా మనం గురుపౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజున ప్రతివ్యక్తి తన గురువును పూజించి వారి ఆశీర్వచనాలను పొందాలి. గురుపౌర్ణమినాడు గురుతుల్యులను యథాశక్తి పూజించి, సత్కరించి వారిని సంతుష్టులను చేయాలని పెద్దలు చెపుతారు. ఈ రోజున దత్తాత్రేయులవారు, షిరిడీ సాయినాధుడు, దక్షిణామూర్తి తదితర గురు దేవాలయాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు.