తొలి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ లిరువురినీ కూడా భక్తితో శ్రద్ధగా పూజిస్తే వారి కరుణా కటాక్షాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. తొలి ఏకాదశి రోజున కనీసం ఏకభుక్తమైనా ఉపవాసంగా ఉండాలన్నది పెద్దల సూచన. ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతారంభం జరుగుతుంది. శివ, విష్ణుభక్తులిద్దరూ చేసే వ్రతమిది.
సర్వ సాధారణంగా ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం మనందరికీ అలవాటు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని పురాణాలు చెబుతున్నాయి. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెపుతారు. అంటే చాతుర్మాస్య వ్రతము తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారని మనకు విశదమవుతోంది.
తొలి ఏకాదశి నుండి ఆచరించే చాతుర్మాస్య వ్రతంలో పాటించాల్సిన నియమాలు
చాతుర్మాస్య వ్రతంలో ఉండగా గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు వంటివి భుజించకూడదు. మంచంపై పడుకొన కూడడు. ఈ నియమాలు విధిగా పాటించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు పలు కథలలో చాల చోట్ల చెప్పబడింది. అహింసా వ్రతాన్ని పాటించే జైనులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని నేటికీ ఆచరిస్తారు. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతం ప్రారంభించాలని భగవంతుడు యుధిష్ఠిరునకు చెప్పినట్లు అందున్నది.