వైఖానస జయంతి 2019- వైఖానస జయంతి ఎలా చేయాలి?

వైఖానస జయంతి ని శ్రావణ పౌర్ణమిరోజున జరుపుకుంటున్నాము. ఇదే రోజున జంధ్యాల పండగ, రాఖీ పౌర్ణమి  కూడా జరుపుకుంటాము. వైఖానసులకు ఇది పరమ పవిత్రమైన రోజు. తిరుమలలో జరిగే నిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి. వైఖాన మహర్షి జన్మ దినమే వైఖానస జయంతి.

వైఖానస జయంతి ఎందుకు చేస్తారంటే...


వైఖానస జయంతి ఎందుకు చేస్తారనే విషయం ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాలననుసరించి వైఖానసులు పూజారులు. వీరు పూజారులే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం కొంత తగ్గినప్పటికీ...రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసినా... వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.

ఈ శాఖకు మూలపురుషుడైన వైఖాన మహర్షి విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారు. అలా ఆవిర్భవించిన విఖనసునితో శ్రీ మహావిష్ణువు... ఓయీ నాయొక్క విగ్రహారాధనకు నాచే సృష్టించబడిన నీవు నా విగ్రహారాధన కొరకు ఒక సూత్రమును యజుర్వేదానుసారంగా రచించు, అది నీ పేరు మీద లోకంలో ఖ్యాతి గడిస్తుంది అని సూచించారు. అప్పుడు విఖనస మహర్షి "ఓ స్వామీ! నీ యొక్క ఆరాధనకు మరియు శాస్త్ర రచనకు నాకు అనువైన ఒక ప్రదేశం సూచించమని ప్రార్ధిస్తాడు . అప్పుడు మహావిష్ణువు తన చక్రాయుధాన్ని వదిలి ఇది ఏ ప్రదేశమును సూచించునో అదియే నీకు నివాస యోగ్యమని సెలవిస్తాడు.

ఆ చక్రాయుధము అన్ని లోకములు తిరిగి చివరకు భూ లోకమున ఒక సుందర ప్రదేశం తాకి అదృశ్యమౌతుంది . చక్రము యొక్క "నిమి " (ఇరుసు) తగిలిన ప్రదేశము కనుక దానిని "నైమిశారణ్యం "అన్నారు. అది మహర్షులకు పుట్టినిల్లు. మనం ఏ పురాణం విన్నా.. ఈ పవిత్రమైన నైమిశారణ్యం ప్రస్తావన లేకుండా వుండదు. కొంతకాలం తపస్సు చేసిన పిమ్మట విఖనసుడు విష్ణువు యొక్క ఆదేశానుసారం శాస్త్ర రచనకు ఉపక్రమించాడు. యజుశాఖకు అనుసంధానంగా వేద ప్రమాణ పూరితంగా వేదాంగాలలో ఒకటైన "కల్పసుత్రం " రచించాడు. ఈ కల్పసూత్రమందు శ్రౌత, దైవిక శారీరక కర్మల గురించి వివరంగా తెలుపబడింది.

ఇదియే "వైఖానసాగమానికి "మూల గ్రంధం. దీని యందు చెప్పబడిన "గృహదేవతార్చన"ని ప్రమాణం గా తీసుకొని భృగు, మరీచి, అత్రి, కశ్యపులు, ఆలయ నిర్మాణము మొదలు నిత్య నైమిత్తిక ,కామ్య ఉత్సవాల వరకు చేయ వలసిన దైవిక కర్మల గురించి అనేక గ్రంధాలు రచించారు. వీరే కాక బోధయనాది మహర్షులు కూడా ఈ కల్పసుత్రాన్నే ప్రమాణంగా చేసుకొని వారి యొక్క శాస్త్రాలను రచించారు. ఈ ఆగమం గురించి పురాణాలలో వేదాలలో గొప్పగా చెప్పబడింది. శ్రౌతంలో చెప్పిన యగాలను ఇప్పటికీ పలువురు ఈ శాస్త్రానుసారంగా నే ఆచరిస్తున్నారు. అందరూ అందుకే వైఖానసాన్నిఅంత గొప్పగా కీర్తిస్తున్నారు.

తిరుమలకు చేరుకున్న విఖనస మహర్షి


ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశం మేరకు ఆయనని పూజించేందుకు విఖనస మహర్షి తిరుమలకు చేరుకుంటాడు. అక్కడే ఆయనకి 'రంగదాసుడు' అనే భక్తుడితో పరిచయం ఏర్పడుతుంది. రంగదాసుడి భక్తి శ్రద్ధలు ... వినయ విధేయతలు చూసి మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. స్వామివారి సేవకు తగిన భక్తుడు లభించాడని ఆనందంతో పొంగిపోతాడు. ఇక రంగదాసుడు కూడా స్వామివారి సేవకుగాను తనకి సరైన మార్గం చూపించే వ్యక్తి దొరికినందుకు ఆనందిస్తాడు.

స్వామివారికి మహర్షి నిత్యపూజలు నిర్వహిస్తూ ఉండగా, అందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను రంగదాసు సమకూరుస్తూ ఉండేవాడు. ఒకరోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్లిన రంగదాసుడు, స్వామి పుష్కరిణిలో గంధర్వ దంపతులు జలకాలడుతూ ఉండటాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. పూజకి వేళ మించిపోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి తిరిగివస్తాడు. స్వామివారి పాదాలపై పడి తన వలన జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అయినా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకున్న స్వామివారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాడు.

ఈ జన్మను చాలించి మరుజన్మలో తన భక్తుడిగా తన ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టవలసిందిగా ఆదేశిస్తాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తరువాత'తొండమానుడు'గా జన్మించి స్వామివారికి మహాభక్తుడై ఆయనకి ఆలయాన్ని నిర్మించి సంతోషంగా సమర్పిస్తాడు.

పాపరహితులైన వారే వైఖానసులు


"ఏ నఖాః తే వైఖానసాః ఏ వాలాః తే వాలఖిల్యాః " అన్న వేద వాక్యాను సారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులైన వారే వైఖానసులు అని అర్ధం. శ్రీవైష్ణవం, శైవం, మధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వచ్చింది కాబట్టి వైఖానసం అయింది.

ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమలవేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

"శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం - అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం" అన్న వైఖానస మహర్షి ప్రార్ధనా శ్లోకం పఠించి..ఘనమైన అంజలి ఘటిద్దాం.