మంగళగౌరి వ్రతం 2018- వ్రతం చేసుకునే విధానం, వ్రత నియమాలు

వ్రతాలనేవి కేవలం భక్తి సంబంధ అంశాలు కాదు. అవి మన జీవన విధానంలో విలువల్ని నింపే కార్యక్రమాలు. హిందూ దేశం కుటుంబ వ్యవస్థకు పెట్టింది పేరు. మనకు బాధ్యతలు, బంధుత్వాల విలువల్ని నోములు, వ్రతాలు చాటిచెబుతాయి. పూరాణాల కాలం నుంచి ఆరచణలో ఉన్న నోములు వ్రతాల పట్ల మనం ఎప్పుడూ అశ్రద్ధగా వ్యవహరించకూడదని పెద్దలు చెబుతారు. శ్రావణమాసంలో మహిళలు ముఖ్యంగా ఆచరించాల్సిన వ్రతాలు రెండు ఒకటి వరలక్ష్మి వ్రతం కాగా మరొకటి మంగళగౌరి వ్రతం.

మంగళగౌరి వ్రతం విశేషాలు

మంగళ గౌరి దేవి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.  శ్రావణమాసం శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. పార్వతి దేవికి ఉన్న మరొక పేరే గౌరీ లేదా మంగళ గౌరి. పూజలు, నోములు, వ్రతాలకు వేదికయ్యే మాసం. పండుగలకు శుభారంభం పలుకుతూ తెలుగులోగిళ్లలో కళా కాంతులను నింపుతుంది ఈ మాసం. కొత్త పెళ్లి కూతుళ్ళు వ్రతాలతో ఈ మాసమంతా బిజీగా ఉంటారు. శ్రావణ మాసంలోని వ్రతాల్లో ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం, ఆతర్వాత శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగుతుంది, నిత్య సుమంగళిగా విలసిల్లుతారు.

ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి ''అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు'' అని అడగగా, శ్రీకృష్ణుడు వెంటనే ''మంగళగౌరీదేవి మహా దేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా అంతరించింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్థిల్లుతారు'' అని చెప్పాడని పురాణ కథనం. ఇలా పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=QieGtpgv7fo

మంగళగౌరి వ్రతం మాంగల్యబలం కోసం...


మంగళగౌరి వ్రతంలో భాగంగా శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత 'గౌరీదేవి'ని భక్తిశ్రద్ధలతో ఆరాధిచాలి. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు 'మంగళగౌరీ వ్రతం' ఆచరించాలి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజించాలి. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలని పురాణాల్లో పేర్కొనబడిందని పెద్దలు చెబుతున్నారు. ఈ వ్రతం చేయడం వలన సకల భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుంది.

మంగళగౌరి వ్రత నియమాలు


మంగళగౌరి వ్రతం లో భాగంగా తొలిసారిగా ఈ నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించాలి. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం శుభకరం. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తకు గానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం ఈ వాయనములు ఇచ్చుకోవచ్చును.

వ్రతంలో వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించ కూడదు, ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లోను విధిగా ఉపయోగించాలి. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ తరువాత, గణేశ నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

శ్రీమంగళగౌరీ దేవి వ్రత కథను చదివే సమయంలో 16 దీపాలను వెలిగించి కాటుకను తీసుకుని దాన్ని రక్షగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి ఐదు దీపాల వంతున పెంచుకుంటూ వ్రతం ముగిసే ఐదవ సంవత్సరం 25 దీపాలు వెలిగిస్తారు. ప్రాంతాన్ని బట్టి కొంచెం పద్దతులు వేరుగా కనిపించినా వ్రత విధానం మాత్రం మారదు. ఈ వ్రతం అత్యంత నియమ నిష్టలతో చేయాల్సిన వ్రతం అంతే కాకుండా ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన వ్రతం.

మంగళగౌరి వ్రత దీపం రక్షతో కలిగే ప్రయోజలివే...


మంగళగౌరి వ్రత దీపం రక్ష స్వీకరించడం వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. వాటిలో మొదటిది వివాహం కాకుండా ఉండే కన్యలకు త్వరగా వివాహం అవుతుంది. అలాగే వివాహం అయిన వారికి మంచి సంతానం కలుగుతుంది. అన్ని రోగాలు తొలగిపోతాయి. దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. భర్తకు ఆయుష్షు వృద్ధి చెందుతుంది. పూజ చేసేవారికి సౌభాగ్యం పెరుగుతుంది. ఇంట్లో మంగళ కార్యాలు ప్రతిరోజూ జరుగుతాయని పండితులు చెబుతున్నారు.