పూరీ జగన్నాధ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణిస్తారు. జగన్నాధ ఆలయంలో ఉండే జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల విగ్రహాలను అంగరంగ వైభవంగా అలంకరించిన రథంలో అధిష్టింపచేసి ఘనంగా యాత్ర నిర్వహిస్తారు. ఆలయం ముందు నుంచీ ప్రారంభమయ్యే యాత్ర సుమారు కిలోమీటరు దూరంలోని గుండీచ మందిరం అనే ప్రాంతం వరకూ సాగుతుంది. ప్రతీ ప్రముఖ దేవాలయంలోను దేవతామూర్తులను ఉత్సవ సందర్భాల్లో రథాలపై ఊరేగించడం చూస్తుంటాం. కానీ పూరీ లోని జగన్నాధ స్వామి ఆలయంలో జరిగే ఈ రథయాత్రకు మాత్రం దేశవ్యాప్తమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.
పూరీ జగన్నాధ స్వామి ఆలయం ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. సుమారు 37 వేల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన అతి ప్రాచీన చారిత్రక దేవాలయం. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసి ఉండడం ఒక విశేషం. శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని కలింగరాజు అనంతవర్మన చోడ గంగాదేవర 1078-1148 మధ్యకాలంలో నిర్మించినట్టు చెప్తుండగా 1174లో ఒడిస్సాను పరిపాలిస్తున్న అనంగ భీమదేవ అనే రాజు ఆలయాన్ని పునర్నిర్మించినట్టు రాగిశాసనాల ఆధారంగా తెలుస్తోంది.
పూరీ జగన్నాధ రథోత్సవ విశేషాలు
పూరీ జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. బలభద్రుని రథం పేరు తాళ ధ్వజం, ఇది ఆకుపచ్చని రంగులో ఉంటుంది. నలుపు రంగులోఉండే సుభద్రాదేవి రధాన్ని దేవదళనం అంటారు. పూరీ రాజవంశానికి చెందినవారు బంగారు చీపురులతో రథయాత్రకు ముందు నేలను శుభ్రం చేసే సంప్రదాయాన్ని ''బెహరా పహరా'' అంటారు. ప్రతి ఏడాది మూడు కొత్త రథాలు చేయించడం ఇక్కడి నియమం. జగన్నాధుని రథానికి 16 చక్రాలు ఉంటాయి.పూరీ జగన్నాధుని రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు రధోత్సవ పనులు మొదలవుతాయి. ముందుగా పూరీ మహారాజు ఆదేశాల ప్రకారం కొత్తగా కలప సేకరించాక, వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు. సేకరించిన కలపను జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు.
తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి తాళధ్వజం. సుభద్రాదేవి దేవదళన్ రధాలను నిర్మాణం పూర్తయ్యాక వాటిని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఎంత వర్ణించినా సరిపోని వైభవంతో సాగే ఈ రధయాత్రను చేసేందుకు వేయి కళ్లు చాలవు. మరెందుకు ఆలస్యం మీరూ బయలుదేరండి.