కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు ఏమిటి?


కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది ఉత్థాన ఏకాదశి కార్తీక సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఇది చాలా విశిష్టమైన పర్వదినం.

చాతుర్మాస్య వ్రతం పూర్తి

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

ఉత్థాన ఏకాదశి వ్రతం వేల జన్మల పాపాలను హరిస్తుంది

ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం ఈ ఒక్క ఏకాదశి పాటించడం వల్ల లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం.

ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఉత్థాన ఏకాదశి నాడు చేసే దానాల మహత్మ్యం

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.

శ్రీమహావిష్ణువుకు హారతి సమర్పించాలి

ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి,  స్వామికి హారతి కర్పూరం సమర్పించి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా దర్శించుకుంటే  అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.