భారతదేశం కళలకు పుట్టినిల్లు. దేశంలోని ప్రతీ రాష్ట్రం ఒక పర్యాటక ప్రాంతంగానో, ఆధ్యాత్మిక ప్రాంతంగానో ఖ్యాతి గాంచాయి. ఎక్కడకెళ్లినా అబ్బురపరిచే శిల్ప కళలు మనను మంత్రముగ్ధులను చేస్తాయి. దేశంలోని అలాంటి ప్రాంతాల్లో ముఖ్యమైది ఒడిస్సా రాష్ట్రం. ఇక్కడి ఆలయాలు మన దేశ పూర్వపు రాజుల కళాపోషణను, మన శిల్పుల కళా నైపుణ్యానికి చక్కని నిదర్శనంగా నిలుస్తాయి. సందర్శనీయ ఆధ్యాత్మిక ప్రాంతాల యాత్రలు చేసే వారు తప్పకుండా ఒక్కసారైసా ఒడిస్సా సందర్శిం చాల్సిందే. ఒడిస్సాలోని కొన్ని ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాల గురించి క్లుప్తంగా పరిశీలిద్ధాం.
లింగరాజా టెంపుల్
భువనేశ్వర్ పరిసర ప్రాంతాల్లో వేలాది హిందూ ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖ దర్శనీయ ప్రాంతంగా బాసిల్లుతోంది లింగరాజా టెంపుల్. ఈ ఆలయాన్ని సోమవంశీయుడైన రాజు జజతి కేసరి సోమవంశస్థుడైన రాజు జజతికేశరి నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయాన్ని పూర్తిగా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. ఈ ఆలయంలో ఈశ్వరుడు ఆరాధ్యదైవం. ఆలయం మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ ఆలయంలో పాలరాతి లింగాన్ని హరిహరులు పేరుతో శివ, విష్ణువులను పూజిస్తారు.రాజారాణీ టెంపుల్
భువనేశ్వర్ లోనే ఉన్న మరో ప్రముఖ దేవాలయం రాజారాణీ టెంపుల్. తూర్పు ముఖంగా నిర్మించిన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒడిషాలోని శిల్పకళానైపుణ్యం ఉట్టిపడే ఆలయాల్లో ప్రముఖమైనది. సుమారు 18 మీటర్ల ఎత్తులో ఉండే ఆలయం మన శిల్పుల కళా నైపుణ్యానికి అద్దంపడుతుంది.ముక్తేశ్వర టెంపుల్
ముక్తేశ్వరాలయం 10వ శతాబ్దంలో నిర్మించబడింది. అద్భుతమైన శిల్పకళను ప్రదర్శించే చిన్న ఆలయం. ఇది కూడా భువనేశ్వర్‌లోనే ఉంది. ఏకరాతిపై చెక్కిన ఎనిమిది రేకులు ఉన్న తామరపువ్వు గర్భగుడిలో ఒక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంపై ఉన్న శిల్పాలు భారతదేశ సంస్కృతి ప్రాచీనతను చాటిచెప్తాయి.కోణార్క్ సూర్యదేవాలయం
ఇది కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. దేశంలోనే అతిపెద్ద సూర్య దేవాలయం. ఆలయం ఒక రథాకృతిలో ఉంటుంది. పీఠంలో 24 చక్రాలు ఉంటాయి. వాటిని ఏడు గుర్రాలు లాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తిచేయడానికి 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆలయంలో ప్రతీ శిల్పం చూస్తుంటే మన రోమాలు ఆసక్తితో నిక్కబొడుచుకుంటాయి. ఇంతటి ఘనమైన చారిత్రక దేవాలయం మన దేశ గొప్ప సంపద అని చెప్పాలి.బౌద్ధారామాలు
ఒడిషాలో ఇంకా ఎన్నో చూడవలసిన ఆలయాలు ఉన్నాయి. అవే కాకుండా ప్రసిద్ధి చెందిన బౌద్ధారామాలకు కూడా ఒడిషా వేదికైంది. ఈ రాష్ట్రంలోని లలితగిరి పర్వతం ఒక పెద్ద బౌద్ధారామం. బౌద్ధులకు ఇది ఒక తీర్థ యాత్రా స్థలం, పర్యాటక ప్రాంతం కూడా. కటక్ నగరానికి 62 కిలోమీటర్ల దూరంలో ఈ లలితగిరి పర్వతం ఉంది. ఇక్కడ ఒకటవ శతాబ్దంలో నిర్మించినవిగా భావిస్తున్న కట్టడాలు పురాతత్త్వ శాస్త్రజ్ఞులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఉదయగిరి పర్వతం
కటక్ ప్రాంతానికి 78 కిలోమీటర్ల దూరాన ఉన్న మరొక బౌద్ధారామం ఉదయగిరి పర్వతం. భువనేశ్వర్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇది కూడా బౌద్ధ మతస్థులకు ఒక యాత్రాస్థలం. ఇంకాభువనేశ్వర్ కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని దయానది వెనుక భాగంలో ధౌలి కొండమీద ఉన్న శాంతిస్థూపం ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది.పూరీ జగన్నాధ్ టెంపుల్
ఒడిషా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పూరీ జగన్నాధుని ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల మూర్తులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది ఒడిషా రాష్ట్రంలోనే అతి పెద్ద ఆలయంగా భాసిల్లుతోంది. 12వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది. ఒక పిరమిడ్ ఆకృతిలో ఉండే ఆలయం యొక్క గోపురం సుమారు 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయ ప్రవేశానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిని సింహద్వార, అశ్వద్వార, హాథిద్వార, వ్యాఘ్రద్వార అని పిలుస్తారు.పూరీ జగన్నాధ్ దేవాలయం పై సవివరమైన కధనాలు ఈ సంచికలో కవర్‌పేజీ కధనంగా అందిస్తున్నాం. దేశ వ్యాప్త ప్రాధాన్యత కలిగిన జగన్నాధ రథయాత్ర కూడా ప్రత్యేక కధనాన్ని ఈ సంచికలో చదవవచ్చు.