కల్పవృక్ష వాహనంపై శ్రీ గోపాల బాలుడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోపాల బాలుడి అలంకారంలో తెల్లటి తలపాగతో రాజదండం దరించి పశువుల కాపరిగా శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు. కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నయినా ఇస్తాయి. ఇవి కోరుకునేవారి తెలివిని బట్టి లభిస్తాయి. ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాల ఏకరూపం. అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు. శ్రీదేవి, భూదేవి ఇహలోక ఫలాలిస్తారు. శ్రీవారు దివ్యలోకఫలాలు, ముక్తిని ప్రసాదిస్తారు. కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపరఫల ఆనందదాయకం.

అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మంగళవారం రాత్రి సమస్త రాజ లాంఛనాలతో సర్వభూపాల వాహనసేవ అద్భుతంగా ఉంటుంది. భూమిని పాలించేవాడు భూపాలుడు. సమస్త విశ్వంలో లెక్కలేనన్ని సూర్యమండలాలున్నాయి. అన్ని సూర్య మండలాల్లోనూ భూమి ఉంది. ఆ భూగ్రహాలన్నింటిని పాలించడం సర్వభూపాలత్వం. నైసర్గిక సరిహద్దులు గల కొంత భూమిపై అధికారం కలిగిన వ్యక్తి భూపాలకుడంటున్నాం.

ఇలాంటి భూపాలురందరూ బ్రహ్మోత్సవాలకు తరలివస్తారు. మా ఏలుబడిలోని భూమిని కల్యాణాత్మకం చేసి రక్షించండని శ్రీవారిని ప్రార్థిస్తారు. ఇదొక విశిష్టసేవ. ఈ సేవ కోసం అందరూ ఐకమత్యంతో, భక్తిపూర్ణహృదయంతో, శరణాగతులై తామే జగత్‌ కల్యాణమూర్తికి వాహనమైపోతారు. అలా వాహనాలుగా మారిన చక్రవర్తుల భుజస్కంధాలపై కల్యాణమూర్తి ఊరేగడమే సర్వభూపాల వాహనసేవ.

Source