శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.
ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పంచద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆలయం వెలుపల గల మండపంలో ఊంజల్ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Source