కల్యాణ వెంకన్నకు వైభవోపేతంగా స్వర్ణ రథోత్సవం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

[gallery columns="2" size="full" ids="2006,2004"]

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పంచ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఉభయదేవేరులతో కలిసి స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మే 7వ తేదీన వసంతోత్సవాలు ముగిసాయి. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొన్నారు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేసారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం సేవలను రద్దు చేశారు.

Source