రథంపై భక్తులు ఉప్పు, మిరియాలు చల్లడం ఆనవాయితీ. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉప్పు, మిరియాలు కలిపి స్వామివారి రథంపై చల్లారు. స్వామివారి రథం చక్రాల కింద పడి నలిగిన ఈ ఉప్పు, మిరియాలను భక్తులు పవిత్రంగా భావించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా నలిగిన ఉప్పు, మిరియాలను తింటే శరీరంలోని రుగ్మతలన్నీ హరించుకుపోతాయని అర్చకులు తెలిపారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీవారికి, నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు అశ్వ వాహనసేవ ఘనంగా నిర్వహించారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
Source