నేత్రపర్వంగా అన్నవరం సత్యనారాయణ మూర్తి కళ్యాణం

అనంతలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. త్రిమూర్త్యాత్మక రూపుడైన శ్రీ సత్యదేవుడు అమ్మవారిని వివాహమాడిన ఘట్టాన్ని తిలకించి భక్తులంతా ఆనందపరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం లోని రత్నగిరిపై వెలసిన సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురువారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక వేదికపై కళ్యాణం నిర్వహించారు. విద్యుద్దీపకాంతులతో ఆలయ ప్రాంగణమంతా మిరుమిట్లుగొలిపింది.

అంకురార్పణ


కళ్యాణ మహోత్సవంలో భాగంగా తెల్లవారుజామునుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. మూడు గంటలకు సుప్రభాతసేవ, ఎనిమిదిగంటలకు ఘనస్వస్తి, చతుర్వేదపారాయణ, తొమ్మిదిగంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణం, దీక్షావస్త్రధారణ తదితర కార్యక్రమాలు పండితులుశాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం ఆలయ ఆనవాయితీ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు గ్రామంలోని విశ్వబ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి అక్కడినుంచి అమ్మవారికి మంగళసూత్రాలు, చుట్లు, నల్లపూసలు, స్వామివారికి వెండి యజ్ఞోపవీతం తదితరాలను స్వస్తి ప్రవచనాలు, మంగళవాయిద్యాలతో స్వామి సన్నిధానానికి తీసుకువచ్చారు.

వాహనసేవలు: పెండ్లికుమారునిగా అలంకృతులైన సత్యనారాయణ స్వామిని గరుడవాహనంపైన, పెండ్లికుమార్తెగా ముస్తాబైన అమ్మవారిని గజవాహనంపైన, పెళ్ళిపెద్దలుగా వ్యవహరిస్తున్న శ్రీ సీతారాములను వెండిపల్లకిపైన అధిష్టింపచేసి సాయంత్రం 6.30 గంటలకు గ్రామోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు.

anantalakshmi satyadeva

వైభవోపేతంగా స్వామి, అమ్మవార్ల కళ్యాణం...


గ్రామోత్సవం తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ అమ్మవార్ల కళ్యాణం అంగరంగవైభవంగా సాగింది. వివిధ రకాల పుష్పాలతో ఎంతో సుందరంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లను రాత్రి 9 గంటల సమయంలో విశేషంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకునివచ్చి పెళ్ళి పెద్దలు సీతారాములవారి పక్కనే ఆశీనులను చేశారు.

విఘ్నేశ్వరపూజతో వివాహ తంతు ప్రారంభించి కన్యావరణం, గౌరీపూజ, ప్రవర, యజ్ఞోపవీతధారణ, కన్యాదానం, మధుపర్కప్రాసన తదితర ఘట్టాలన్నీ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అనంతరం సుముహూర్త వేళ వధూవరులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని అలంకరించారు. తరువాత మంగళకరమైన మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలను కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం చెందారు.

కళ్యాణోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం తరపునుంచి స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను భక్తులకు పంపిణీచేశారు.