మత్స్యావతారంలో కనువిందుచేసిన చిన్నవెంకన్న

చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి వైశాఖమాస స్వీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు. వైఖానస ఆగమయుక్తంగా ఇంద్రాది అష్టదిక్పాలకులను, భేరీ దేవతలను, గంధర్వ, కిన్నెర, కింపురుషాది దేవగణాలను, సప్త అధోలోక జీవులను స్వాగతిస్తూ లాంఛనంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడపటాన్ని అర్చకులు ఎగురవేశారు. ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు.
గురువారం ఉదయం విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవ నిత్యహోమ గ్రామబలిహరణలు, వేదస్వస్తి జరిగింది. అనంతరం సాయంత్రం రుత్విగ్వరణం, మృద్గ్రహణ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు.

అంకురార్పణ


సాయంత్రం ఆలయంలో విష్వక్సేనుని ఒక వాహనంపై ఉంచి విశేష అలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పుట్టమన్నును తెచ్చారు. ఆలయ ఆవరణలో అంతకుముందు సిద్ధంగా ఉంచిన పాలికల్లో పుట్టమన్నును పోసి, వేదమంత్రోచ్ఛారణ మధ్య నవధాన్యాలను అందులో వేసి శాస్త్రోక్తంగా అర్చకులు అంకురార్పణ జరిపారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గరుడపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ నిర్వహించిన అనంతరం అర్చకులు గరుడప్రసాదాన్ని మహిళలకు పంపిణీ చేశారు.
ఈ గరుడ ప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

హంసవాహనం


ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం శ్రీవారి తిరువీధిసేవ కన్నులపండుగగా నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై ఉభయదేవేరులతో పాటు స్వామివారిని అధిష్టింపచేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ రాజగోపురం మీదుగా శ్రీవారి వాహనాన్ని గజసేవ నడుమ తీసుకువచ్చి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవాన్ని జరిపారు. అధికసంఖ్యలో భక్తులు ఆ దేవదేవుని నేత్రపర్వంగా గాంచి నీరాజనాలు సమర్పించారు.

మత్స్యావతారంలో...


బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇందులో భాగంగా గురువారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు కనువిందు చేశారు.