వైభవోపేతంగా ద్వారకాతిరుమలేశుని వైశాఖ మాస స్వీయ బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమలేశుని వైశాఖ మాస స్వీయ బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామివారి స్వీయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా సర్వాంగసుందరంగా అలంకరించారు . సర్వాభరణ భూషితుడైన చినవెంకన్న నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో పెళ్లి కుమారునిగా శోభిల్లారు. అలాగే పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెళ్లికుమార్తెలుగా ముస్తాబయ్యారు.

శ్రీవారిని, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా చేయు వేడుకలు తిలకించిన భక్తజనులు ఆనందపరవశులయ్యారు.  ఆలయ అర్చకులు, పండితులు ఈ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

తొలుత ఆలయ ప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికను సుగంధభరిత పుష్పమాలికలు, మామిడితోరణాలు, అరటి బోదెలతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే ఆలయ పరిసరాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదికపై ఏర్పాటుచేసిన రజత సింహాసనంపై శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఎంతో అంగరంగవైభవంగా ఈ వేడుక నిర్వహించారు. వైకుంఠనాధునిగా చినవెంకన్న
శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాధునిగా చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ముఖమండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమీయనున్నారు. ఈ క్రమంలో ఉత్సవాల ప్రారంభం రోజున శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాధునిగా కొలువుతీరిన స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.