సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామి సాక్షాత్కారం

ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు సూర్య ప్రభవాహనంపై మదనగోపాలుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి క్షేత్ర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

రాత్రి చంద్రోదయం వేళ చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించిన స్వామి దివ్యమంగళ స్వరూపుడై విహరిస్తూ భక్తులకు అభయమొసంగారు. మహోత్సవాల్లో భాగంగా ఆలయంపై అత్యంత వైభవంగా ఏర్పాటుచేసిన పలు రకాల విద్యుద్దీపాలంకరణలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వివిధ దేవతామూర్తుల విద్యుద్దీపాల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.

నేటి ప్రత్యేక అలంకారం


బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం యోగనారాయణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అధిష్టించిఉన్న యోగనారాయణుని భక్తులు తనివితీరా దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

బ్రహ్మోత్సవాల్లో శనివారం జరిగే కార్యక్రమాలు


• ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై గ్రామోత్సవం.

• రాత్రి 7గంటలకు ఎదుర్కోలు ఉత్సవం.

• రాత్రి 8.30గంటలకు వెండిశేషవాహనంపై గ్రామోత్సవం.