సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 251వ జయంతి ఉత్సవం సందర్భంగా కళాకారులు ఆలపించిన కీర్తనలతో తిరుమలగిరులు పులకించాయి. తిరుమలలోని పాపవినాశనం మార్గంలో గల కల్యాణవేదిక ప్రాంగణంలో టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా శ్రీ త్యాగరాజస్వామివారి జయంతి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి, దూరదర్శన్ టాప్‌గ్రేడ్ కళాకారులు, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, స్థానిక, స్థానికేతర కళాకారులు కలిసి దాదాపు 350 మంది పాల్గొని రసరమ్యంగా కీర్తనలను ఆలపించడంతో తిరుమలగిరులు మారుమోగాయి.
”జగదానందకారక…., దుడుకు గల నన్నేదొర…, సాధించెనే….., కనకరుచిరా…., ఎందరో మహానుభావులు….., తెర తీయగ రాదా…. ” తదితర కీర్తనలను కళాకారులు రాగ భావ యుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి గాత్రం, వీణ, వయోలిన్, వేణువు, డోలు, నాదస్వరం కళాకారులు, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Source