ద్వారకాతిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల శేషాచల పర్వతం నూతన శోభను సంతరించుకుంది. బుధవారం నుంచి ఎనిమిది రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీవారికి నిత్యం విశేష అలంకారాలు, వాహన సేవలు వైభవోపేతంగా జరుగుతాయి.

ప్రతీ సంవత్సరం వైశాఖమాసంలో జరిగే ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు ఈనెల 25 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు జరిగే ఎనిమిది రోజులు స్వామివారు నిత్యం విశేష అలంకారాలతో పాటు వివిధ వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఆలయ తూర్పు వైపున ఉన్న శ్రీహరి కళాతోరణం వేదిక కానుంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

venkateswara swamy

రోజువారీ కార్యక్రమాలు ఇలా..



  • ఈనెల 25న ఉదయం 7 గంటలకు స్వామిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరిస్తారు. ఇదే రోజు రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.

  • 26న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, ధ్వజారోహణం, రాత్రి 8 గంటల నుంచి హంసవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది.

  • 27న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై చినవెంకన్న గ్రామోత్సవం.

  • 28న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం. రాత్రి 8.30 గంటలకు వెండి శేష వాహనంపై గ్రామోత్సవం.

  • 29న ఉదయం 7 గంటలకు సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం. రాత్రి 9గంటల నుంచి స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం.

  • 30న రాత్రి 7 గంటలకు రథోత్సవం.

  • మే 1న ఉదయం 10.30 గంటల నుంచి చక్రవారి-అవభృథోత్సవం, మధ్యాహ్నం 3గంటలకు వేద సదస్సు. రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై గ్రామోత్సవం.

  • 2న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం. రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగోత్సవం