వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవం

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. కోనసీమ తిరుపతిగా భాసిల్లుతున్న వాడపల్లి వెంకన్న కళ్యాణాన్నీ వీక్షించేందుకు జనసముద్రం తరలివచ్చింది. అత్యంత వైభవోపేతంగా స్వామి కళ్యాణం జరిగింది. విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతమంతా మిరుమిట్లు గొలిపింది. పుష్పాలంకరణలతో  కళ్యాణవేదిక కాంతులీనింది. వాడపల్లి ఆలయ క్షేత్రపాలకుడైన అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి సాక్షిగా దేవదేవుని కళ్యాణం కమనీయంగా సాగింది.

vadapalli-venkanna

తొలుత సాయంత్రం స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేసి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామంలోని తిరుమాడ వీధుల్లో బ్రహ్మాండంగా జరిగిన రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. గోవిందనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులంతా పోటీపడ్డారు. రథంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఆనందపరవశులయ్యారు భక్తులు.

రథోత్సవం అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లను నూతన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలతో, ఎదురుసన్నాహాలతో ఆలయంలోకి తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు కళ్యాణం ముందుగా మంగళస్నానాలు చేయించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగసుందరంగా అలంకరించి పల్లకిపై అధిష్టింపచేసి కళ్యాణవేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనంపై అధిష్టింపచేసారు. ఈ సందర్భంగా ముందుగా విష్వక్సేనపూజ, రక్షాబంధనం, మధుపర్కప్రాశన, కన్యాదానం, మహాదాశీర్వచనం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం ప్రభుత్వం తరపున, పాలకమండలి తరపున పట్టువస్త్రాల సమర్పణ జరిగింది. భక్తులు ముత్యాల తలంబ్రాలు అందచేసారు. కళ్యాణం నిర్వహిస్తున్న సమయంలో వందలాది కిలోల కర్పూరం వేదికవద్ద వెలిగించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు, వేదపండితుల సమక్షంలో ఆగమశాస్త్రాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులంతా వీక్షించి తన్మయత్వం పొందారు.