కనులపండుగగా కోదండరాముని కళ్యాణం

శ్రీరామనవమిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి మామిడాడలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరాముని కల్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా  ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో మామిడాడ రామనామ స్మరణతో మార్మోగింది.

తెల్లవారుజాము నుంచి కల్యాణ తంతు ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం 11గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.

1.40గంటలకు సుముహూర్త సమయంలో సీతారాములకు శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాంగల్యధారణ నిర్వహించారు.

రాములవారి కళ్యాణానికి దీక్షబూని గోటితో ఒలిచి సిద్ధంచేసిన తలంబ్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం ఆ అక్షతలను భక్తులకు ప్రసాదంగా అందచేసారు. అనంతరం మహాన్నసమారాధన కూడా నిర్వహించారు.