కళ్యాణవైభోగమే...ఘనంగా సింహాచలేశుని కళ్యాణ మహోత్సవం

చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి సింహగిరి పై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు.

తొలుత సాయంత్రం కొట్నాల ఉత్సవం ఘనంగా జరిపారు. ఆ తర్వాత ఉభయ దేవేరులను, స్వామివారిని వేర్వేరు పల్లకీల్లో వేంచేపుచేసి సింహగిరి మాడవీధుల్లో ఎదురు సన్నాహ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం రథోత్సవం ఎంతో ఉత్సాహంగా, అశేష ప్రజానీకం మధ్య కోలాహలంగా సాగింది. భక్తజనం రథాన్ని లాగుతుండగా స్వామి ఊరేగింపు ఎంతో వైభవోపేతంగా సాగింది.

నాదస్వరము, మంగళవాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లను సింహాసనంపై అధిష్టింపచేసి జీలకర్ర బెల్లం వారి శిరస్సులపై ఉంచి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రబద్ధంగా ఘనంగా జరిపారు. ఆణిముత్యాలను తలంబ్రాలుగా స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు పోటెత్తారు. ఆ ప్రాంతమంతా హరి నామస్మరణతో మారుమ్రోగింది.