విళంబినామ సంవత్సరంలో అన్నీ శుభాలే

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అన్నారు. బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోందని,  ఉగాది పచ్చడిలో జీవితసారం దాగి ఉందని ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికీ ఒక అనుభూతి ఉంటుందనివక్తలు పేర్కొన్నారు. అనుభూతుల సమ్మేళనమే జీవితమని, మానవజీవితం సుఖదుఃఖాల సమాహారమని, అన్నింటినీ సమభావనతో స్వీకరించి ముందుకెళ్లాలని టిటిడి తిరుపతి జెఈవో భాస్కర్ సూచించారు.

ఈ సందర్భంగా శ్రీ గోపావఝల బాలసుబ్రహ్మణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. విళంబినామ సంవత్సరంలో వర్షం ఆశించినస్థాయిలో కురిసి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. అనంతరం పంచాంగకర్తను శాలువ, జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదం, నూతన వస్త్రాలతో టిటిడి జెఈవో సన్మానించారు.

ఆకట్టుకున్న అష్టావధానం


ఈ సందర్భంగా టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అష్టావధానం ఆకట్టుకుంది. శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు ఉగాది పర్వదినం గురించి పరిచయం చేశారు. డా|| సముద్రాల లక్ష్మణయ్య అధ్యక్షత వహించగా, ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు సమన్వయకర్తగా వ్యవహరించారు. శ్రీ మైలవరపు మురళీకృష్ణ అవధానం చేశారు. నిషిద్ధాక్షరి శ్రీ చెంచుసుబ్బయ్య, సమస్య శ్రీ చెన్నకేశవులునాయుడు, దత్తపది శ్రీ శ్రీమన్నారాయణ, న్యస్తాక్షరి శ్రీ వై.పరమేశ్వరయ్య, వర్ణన శ్రీ రామచంద్రారెడ్డి, ఆశువు శ్రీ రెడ్డెప్ప, చిత్రగణితం శ్రీమతి తేజోవాణి, అప్రస్తుత ప్రశంస శ్రీ హేమంత్‌కుమార్‌ చేశారు. అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Source