తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 18న శ్రీ విళంబినామ ఉగాది సందర్భంగా సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పుష్పపల్లకీ సేవ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి 2016వ సంవత్సరం నుండి పుష్పపల్లకీ సేవను నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి పుష్పాలు ప్రీతికరమైనవని , కావున పుష్పపల్లకీపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారన్నారు.
అనంతరం టిటిడి తిరుపతి జేఈవో శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ పుష్పపల్లకీలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సమకూరతాయని తెలిపారు.
పుష్పపల్లకీ సేవ అనంతరం ఆలయంలో పంచాంగశ్రవణం నిర్వహించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో స్నపనతిరుమంజనం, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, ఏవిఎస్వో శ్రీ పార్థసారథి రెడ్డీ, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు శ్రీ కులశేఖర్, గురవయ్య ఇతర అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Source