స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు.
గజ వాహనం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
భక్తిభావాన్ని పంచిన ధార్మిక కార్యక్రమాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి.
ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి విరజానంద ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హరికథా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు.
Source