ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలను 1460 సంవత్సరంలో అచ్యుతరాయలు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. గురువారం ఉదయం 7.00 నుండి 8.00 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగుమాడ వీధులలో ఊరేగిన అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న వసంతవనం
కాగా వసంత మండపాన్ని ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఒక అందమైన భూలోకనందనవనంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వనంలో కొలువుతీరిన పశుపక్షాదులు, అనేకానేక మృగాలు, సెలఏరు, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలచాయి. వసంతవనంలో ఏర్పాటుచేసి ఉన్న అద్భుతమైన కళాఖండానికి సంబంధించిన పక్షుల కిలకిలారావాలు, సింహం-పులి-ఏనుగుల గర్జన ఘీంకారాలు, సెలయేటి గలగలలు, పాముల బుసబుసలు, కోతుల కిచకిచలు అన్నింటిని మించి వనంలోని పూతోటల సొబగులు, భక్తుల హృదయాంతరాలాలను పులకింపజేశాయి.
వైభవంగా శ్రీవారికి స్నపనతిరుమంజనం – పులకించిన భక్తులు
తిరుమల శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా పడమర మాడవీధిలోని వపంత మండపంలో గురువారం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి నిర్వహించిన స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది.
ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ష్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్ళు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయములో అనుసంధానము చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
కన్నులపండుగగా స్వ ర్ణరథోత్సవం
రెండవరోజు మార్చి 30వ తేదీన శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు బంగారు రథం అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
చివరిరోజు మార్చి 31వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయాన్ని చేరుకుంటారు.
వసంత్సోవ వేడుకలను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 30వ తేది శుక్రవారం తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనంసేవలను రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యర్‌స్వామి తదితరులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Source