యమునా నదీ జననం
సూర్యుని భార్య సంజ్ఞ. ఈమె సూర్యుని యొక్క తేజస్సును చూడలేక కళ్ళుమూసుకుంటుంది. దానికి కోపించిన సూర్యుడు నీకు నిఖిలజనైక సంయముడగు ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెబుతాడు. దాని కారణంగా ధర్మం తప్పిన వారిని శిక్షించే యముడు జన్మిస్తాడు. తరువాత సంజ్ఞ సూర్యుని సమీపించినపుడు చంచల దృష్టితో చూడగా, సూర్యుడు కోపించి ఈసారి నీకు విలోలమైన కూతురు కలుగుతుందని అంటాడు. తత్ఫలంగా చంచలమైన యమున(నది) జన్మిస్తుంది. యమునానది సూర్యుని కుమార్తె అవడం వలన ఆమె సూర్యతనయ అని, యముని చెల్లెలు అవడం వలన యమున అని పిలుస్తున్నారు. యమునానదిని ఇంకా శమనస్వస్తా, కాలిందీ అనే పేర్లతో కూడా కీర్తిస్తున్నారు.
యమునా నది ఉత్తరప్రదేశ్ లోని తెహ్రిగడ్వాల్ ప్రాంతంలోని కాళిందీ పర్వతపు మంచు శిఖరాల్లో ఉద్భవించింది. ఈ నదీమూలం యమునోత్రికి ఆరున్నర కిలోమీటర్ల పైన ఉంది. గంగోత్రి లాగానే యమునోత్రి కూడా అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ స్నానాలు ఆచరించినవారికి సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమునోత్రికి వెళ్ళడానికి మే, జూన్ నెలలు అనువైనవి. మిగిలిన రోజులలో మంచు కురుస్తుంది. యమునోత్రి దగ్గర యమునా మాతకు చిన్న ఆలయం ఉంది. దానిలో తాబేలు మీద నీటి కడవని పట్టుకున్నట్లుండే యమునామాత విగ్రహం కనిపిస్తుంది. యమునోత్రిలో వేడి చలమలు ఉన్నాయి. ఈ యమునోత్రి నుంచి ప్రవహించిన యమున శివాలిక్ పర్వత శ్రేణులను చీల్చుకుంటూ ఫెజాబాద్ దగ్గర మైదాన ప్రాంతాలను చేరుకుంటుంది. అనంతరం భారత రాజధానియైన ఢిల్లీమీదుగా ప్రవహించి బృందావన్, మధురలను చేరుతుంది.
బృందావన్, మధురలు పురాణప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రాలు. మధురానగరం శ్రీకృష్ణుని జన్మస్థలం. యమునాతీరాన గల మధురానగరంలో అనేక పుణ్య ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ధృవఘట్టము, సంకఘాతికాఘట్టము, విశ్రమఘట్టము ముఖ్యమైనవి. బృందావనం మధురానగరానికి దగ్గరలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి గోపాలుడయ్యాడు. గోపబాలురతో కలిసి మెలిసి తిరుగుతూ బాల్య క్రీడలు వినోదముగా సల్పాడు.
ఈ బృందావనములోనే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలులను కాపాడాడు. ఈ స్థలానికి దగ్గరలోనే యమునానది ఒక పాయగా చీలి పెద్ద వొంపు తిరిగింది. దీనికి కారణం ఒకసారి బలరాముడు బంధుసమేతంగా యమునాస్నానానికి వెళ్ళి, యమునను పిలువగా ఆమె బదులివ్వదు. అందుకు బలరాముడు కోపించి నీవు రానిచో నిన్ను చీల్చగలనని తన హలాయుధాన్ని అందులోకి చొప్పిస్తాడు. అందుకు భయపడిన యమున స్త్రీ రూపంలో వచ్చి బలరామునికి అమూల్య రత్నాలిచ్చి వెళుతుంది. అప్పటినుంచీ యమునానది ఈ బృందావనం దగ్గర ఒంపు తిరిగిందనీ, యమునానదీ జలాలు తెల్లగా అయ్యాయనీ చెబుతారు. యమునా తీరాన ఉన్న ఈ బృందావనంలో 32 తీర్థ ఘట్టాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం పుణ్యప్రదం.
బృందావన్, మధురలను దాటిన యమునానది ఆగ్రామీదుగా ప్రవహిస్తుంది. ఆగ్రానగరం ఒకప్పటి మొగల్ పాదుషా రాజధాని. ఇక్కడే యమునాతీరాన ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఉంది. ఆగ్రా చేరువగానే భారత చేతి పరిశ్రమలు, బిన్ని పరిశ్రమలు గల దయాల్బాగు పారిశ్రామిక కేంద్రం ఉంది. ఇది రాధాస్వామి మతస్థుల పుణ్యక్షేత్రం కూడా. ఆగ్రా నగరం నుంచి యమునానది ప్రవహిస్తూ 1370 కిలోమీటర్ల పొడవును, 3,59,000 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని ఏర్పరచుకొని అలహాబాద్ లో గల ప్రయాగ దగ్గర గంగానదిలో కలుస్తోంది. ఈ కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు నదులే కాక అంతర్వాహిని అయిన సరస్వతి నది కూడా వీటిలో ఇక్కడ కలుస్తుండడం వలన ఈ ప్రదేశానికి త్రివేణీ సంగమం అని పేరు వచ్చింది. ఈ త్రివేణీ సంగమం పవిత్రమైన సుప్రసిద్ధ యాత్రాస్థలం. 60 కోట్ల పుణ్యతీర్థాలు ఈ సంగమంలో కలిసి ఉండడం వలన ఇక్కడ స్నానం విశేష పుణ్య ఫలితాలను ఇస్తుందని భారతం చెబుతోంది.
గంగానదికి ఉపనది అయిన యమునానదిలో అనేక నదులు కలుస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది చేంబలీనది. ఈ నదే పురాణాలలో చెప్పబడిన చర్మణ్వతి నది. ఈ నది రంతిదేవుని కారణంగా జన్మించింది. వింధ్యపర్వత వరుసలలోని జనపాల్ కొండల వరుసలో ఈ చేంబలీ పుట్టి ఇటార్సి నగరం దగ్గరలో యమునలో కలుస్తోంది. యమునానదిలో కలిసే మరొక నది గౌరి. ఇది సిమ్లా నుండి పారి పౌంటాసాహెబ్ అనేచోట యమునానదిలో కలుస్తోంది. యుజాఫర్ నగర్ వద్ద సాహిబి అనే మరొకనది యమునలో కలుస్తోంది. ఇంకా సింధ్, బెట్వా, ధసన్, కైన్ అనే నదులు కూడా యమునానదిలో కలుస్తున్నాయి.
ఈవిధంగా అనేక ఉపనదులను తనలో కలుపుకున్న యమునానది ప్రజల వ్యవసాయానికి, పరిశ్రమలకు, నదీ వర్తకానికి ఎక్కువగా పనికివస్తోంది. యమునానది కాలువలలో ముఖ్యమైనవి మూడు. తూర్పు యమునా కాలువ. పడమటి యమునా కాలువ. ఆగ్రా కాలువ. తూర్పు యమునా కాలువ మొగల్ సుల్తానుల కాలంలో మొహ్మద్ షాహ్(1719-1748) నిర్మించారు. దీనిని 19వ శతాబ్దములో బ్రటిష్ వారు పునరుద్ధరించారు. ఈ కాలువ వలన రెండు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. పడమటి యమునా కాలువను ఫిరోజ్ షా తుగ్లక్(1351-1388) నిర్మించారు. ఇది మరలా అక్బర్ (1556-1605) కాలంలోను, షాజహాన్(1568) కాలంలోను తిరిగి 19వ శతాబ్దంలోను పునరుద్ధరింపబడింది.
ప్రస్తుతం ఈ కాలువచే సుమారుగా 5,32,600 ఎకరాల భూమి సాగులోకి వస్తోంది. ఇక ఆగ్రా కాలువ వలన సుమారు 1,67,450 ఎకరాలకు నీరందుతోంది. ఇంకా యమునానది ఉపనదియైన బేట్వా నుండి త్రవ్వబడిన బేట్వాకాలువలు కూడా ఉత్తరప్రదేశ్ లోని అధిక పంటలకు ఆధారమయ్యాయి. యమునానది డూస్ కాలువ వలన కూడా 11,280 ఎకరాల భూమి సాగులో ఉంది.
యమునానది ప్రాశస్త్యం
యమునానదిని వైదిక గ్రంథాలైన ఋగ్వేదంలోను, అధర్వణ వేదంలోను, శతపథ, ఐతరేయ, షడ్వంశ, బ్రహ్మణాలోను ఆపస్తంబ మంత్ర పాఠంలోను వర్ణించారు. శ్రీరాముడు వనవాస సమయములో గంగా, యమునల సంగమాన్ని చూచినట్లు, సీతారామలక్ష్మణులు యమునానదిని దాటుతున్నప్పుడు సీతాదేవి యమునను స్తుతించినట్లు రామాయణం చెబుతోంది. కృష్ణద్వైపాయనుడు(వేదవ్యాసులవారు), మాంధాత మొదలగువారు ఈ యమునాతీరంలోనే జన్మించినట్లుగా చెబుతున్నారు.
యమునానది బాలకృష్ణుని వ్రేపల్లెకు తీసుకువెళ్ళేటప్పుడు రెండు పాయలుగా చీలి వసుదేవుని మార్గాన్ని సుగమంచేసి భగవత్కార్యానికి సహాయం చేసింది. ఇక దేవదేవుడైన శ్రీకృష్ణుని బాల్యలీలలను, రాసక్రీడలను, మోహన మురళీగానాన్ని కనులారా దర్శించి, విని తరించి ధన్యమైనది యమున.
యమునానదికి సంబంధించిన పర్వదినాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి యమవిదియ(భాతృద్వితీయ), దీనినే దీపావళి పండుగ అయిన తరువాత రెండవ రోజున(కార్తిక శుక్ల విదియ) జరుపుతారు. ఈ యమ విదియ నాడు యమునా నది వద్దకు అన్న అయిన యముడు ప్రతి ఏటా వస్తాడని, వచ్చిన అన్నగారిని యమున ఆదరించి ఆతిధ్యాన్నిచ్చి ఎంతో గొప్పగా సత్కరిస్తుందని కథనం. చెల్లెలిచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి విందారగించిన యముడు తన చెల్లెలిని సకల సుఖాలతోను, సుమంగళిత్వంతోను జీవించమని ఆశీర్వదిస్తాడని చెబుతూ అన్నాచెల్లెళ్ళ అనురాగాన్ని తెలిపే పండుగను ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మిక. అందుకనే ఈరోజున అన్నలు తమ చెల్లెళ్ళ ఇంట భోజనం చేసి వారి శక్తికొలదీ కానుకలను ఇస్తారు.
ఇంకా పౌర్ణమినాడు ఈ నదీతీరాన అనేక తిరునాళ్ళు జరుగుతాయి. వీటన్నింటిలోను బటేశ్వర్ లో జరిగే తిరునాళ్ళు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఈ నదికి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం నుండి 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. ఇది పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యంకాక చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. ప్రఖ్యాతిగాంచిన ఈ యమునానది తీరాలలో మౌర్యుల, గుప్తుల, హర్షుల, ముస్లిం సుల్తానులు, మొగలులు, బ్రిటిషర్ల కాలంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహాభారతయుద్ధం, పానిపట్టు మూడు యుద్ధాలు, ముస్లిం సుల్తానులు, రాజపుత్రుల మధ్య యుద్ధం, సిక్కులు, బ్రిటిషర్ల మధ్య యుద్ధం ఈ నదీ తీరాలలోనే జరిగాయి. ఈ ప్రకారం ఎంతో పౌరాణిక, చారిత్రాత్మక ప్రాశస్త్యం కలది యమునానది.
‘‘యోజనానాం సహస్రేషు కీర్తనాత్ పాపనాశినీ’’
అని కూర్మపురాణం చెబుతోంది. యమునానది స్మరణంతోనే సకల పాపాలు తొలగిపోతాయి అని దీని అర్థం.