కన్నడదేశములో ఒక పట్టణములో పూర్వం ఒక ధనికుడు కాపురం ఉండేవాడు. అతడు ఆగర్భశ్రీమంతుడు. లెక్కకు మిక్కిలిగా భవనాలు, క్షేత్రాలు అతనికి ఉన్నాయి. అంతేకాక తాను తన కుటుంబంతో నివసించేందుకు ఒక నాలుగంతస్థుల మేడను ప్రత్యేకంగా సర్వాంగసుందరంగా నిర్మించుకున్నాడు. అందులో సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ జీవించసాగాడు.
ఈ ధనవంతునికి ప్రాపంచిక సంపద లెక్కకు మిక్కిలిగా విస్తరించి ఉంది తప్ప దైవపరమైన సంపద కొంచెమైననూ లేదు. భగవంతునిపై విశ్వాసం ఏమాత్రమూ లేదు. భగవన్నామస్మరణ చేయమని గాని ఎవరైనా చెబితే అతడు ఏమాత్రం లక్ష్య పెట్టడు. కేవలం తనకు సంపదే కావాలని కోరుకుంటూ భోగలాలసుడిగా జీవితాన్ని సాగిస్తున్నాడు. కాలచక్రం వేగంగా తిరుగుతోంది. కొంతకాలానికి అతనికి వార్ధక్యం దాపురించింది. అవయవాలన్నీ స్వాధీనం తప్పుతూ వస్తున్నాయి. శరీరం శుష్కించిపోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒకానొకరోజు ఆ ధనవంతుడు అస్వస్థతకు గురై మంచం పట్టాడు. ధనవంతుడు కావడం వల్ల గొప్ప గొప్ప వైద్యులు వచ్చి చికిత్సలు చేస్తున్నారు. కానీ వ్యాధి ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు సరికదా నానాటికీ అతనిలోని రుగ్మత అధికం కావచ్చింది. వైద్యాచార్యులందరూ నిరాశా నిస్సహాయతలను వ్యక్తంచేయడం ప్రారంభించారు. ఈ సందర్భంలో ధనవంతుని బంధువులు, ఆప్తులు, మిత్రులు ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ఆలోచించి వైద్యసేవలు చురుగ్గా అందించడంకోసం ధనవంతుని మూడవ అంతస్థు నుంచి కిందకు తీసుకువచ్చి పెరటిలో ఉన్న కొట్టంలో పడుకోబెట్టారు.
జీవింతంలో ఒక్క పుణ్యకార్యమైనా చేయనివాడు. ఒక్క పర్యాయం కూడా భగవంతునినామాన్ని ఉచ్ఛరించనివాడు పైపెచ్చు ఎన్నో పాపకార్యాలు చేసినవాడు...అటువంటి వానికి సద్గతి ఎట్లు లభిస్తుంది? అంటూ బంధువర్గం తలపోస్తూ అయినా వదలక ముక్తి మార్గాలను అన్వేషించసాగారు.
మహా గురువులు, గొప్ప తపస్సంపన్నులు, బ్రహ్మనిష్ఠాపరులు, దైవసాంగత్యాన్ని పొందినవారిని సంప్రదించి వారి సలహాలను తీసుకోవడం మొదలుపెట్టారు. ‘‘అయ్యా! మా బంధువర్గంలో ఒకడు జీవితంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు. ఇప్పడు వృద్ధుడై, రోగ గ్రస్థుడై కాటికి కాలు జాపుకుని ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు తరించుటకు, సద్గతి పొందుటకు మార్గం ఏదైనా ఉన్నదా?’’ అంటూ బంధువర్గం వారిని ప్రశ్నించారు.
వారందరూ ఏకగ్రీవంగా చెప్పినమాట ‘‘ఓ అజ్ఞానులారా ! బాల్యమందుగాని, యవ్వనమందు గాని, వార్ధక్య దశలో గాని, చివరకు అవసాన దశలో గాని ఏ కాలమైనా మనిషికి శ్రేయస్సునందించేది దైవచింతన, భగవన్నామస్మరణయే’’. దీంతో బంధుమిత్ర గణమంతా ధనవంతుని వద్దకు చేరుకుని మంచం చుట్టూ చేరి వారి వారి వరుసలతో బావగారూ...మామగారూ...నాన్నగారూ...అన్నయ్యగారూ... నారాయణ, నారాయణ అనండి...కృష్ణ కృష్ణ అనండి...అంటూ ధనవంతునిచే భగవన్నామస్మరణ చేయించే ప్రయత్నం ప్రారంభించారు. ఎంత బిగ్గరగా అరిచినా, చెవిలో శంఖం పెట్టి ఊదినట్లుగా చెప్పినా ధనవంతుడు మాత్రం స్పందించడంలేదు.
ఈ పరిస్థితిని చూసి విస్తుపోయిన బంధువులు ‘‘ఇతడు అభాగ్యుడు, కనీసం అంత్య కాలంలో కూడా దేవుని స్మరించే పుణ్యానికి నోచుకోలేదు. మాటమాత్రంగా కూడా భగవన్నామస్మరణ చేయడంలేదు. మరణానంతరం ఎటువంటి ఘోర నరకముల పాలగునో?’’ అంటూ విచారించసాగారు. ఈలోగా రోగియొక్క ముఖంలో ఏవో పదాలు ఉచ్ఛరిస్తున్న శబ్దం వినబడి బంధుమిత్ర పరివారమంతా ఆసక్తిగా అతడేదో చెప్తున్నాడని చెవులు నిక్కబొడుచుకుని నోటి సమీపానికి వెళ్ళి వినేందుకు వినేందుకు ప్రయత్నించారు.
అవసానదశలో ఉన్న ధనవంతుడి నోట్లోంచి వచ్చే శబ్దాల్లోంచి క, క, క అంటూ మూడక్షరాలు మాత్రం స్పష్టంగా వినగలుగుతున్నారు. ఎంతకీ అతడు చెప్పబోయేది ఏమిటో అర్థం కాని బంధువులు బహుశా ఇదేదైనా భగవన్నామమా? లేక దేవతలు చివరి ఘడియల్లో అతడికి ఏదైనా మంత్రాన్ని ఉపదేశించారా? లేదంటే అవి గొప్ప బీజాక్షరాలు అయి ఉంటాయా? అయితే గనుక మనం కూడా వాటిని ఉచ్ఛరించాలి. మనకు కూడా సద్గతి కలుగుతుంది. అనుకుంటూ అసలు ఈ క, క, క అన్న శబ్దాలకు అర్థం ఏమో తెలుసుకోదలచారు. వాటికి అర్థాన్ని కేవలం రోగి ఒక్కడే చెప్పగలడు.
కాబట్టి మళ్ళీ వారంతా రోగివద్దకు చేరి బావగారూ...మామగారూ...నాన్నగారూ...అన్నయ్యగారూ... ఈ క, క, క పదానికి అర్థమేమిటి? త్వరగా చెప్పండి అంటూ బిగ్గరగా అడగసాగారు. కానీ రోగి నుంచి ఏమీ సమాధానం రాకపోయే సరికి నిరాశకు గురయ్యారు.
అయినా పట్టువీడక పట్టణంలో ఉన్న గొప్ప వైద్యుని వద్దకు వెళ్ళి ‘‘మహాప్రభో! మహా శ్రీమంతుడైన మా బంధువు చివరి ఘడియల్లో ఏవో బీజాక్షరములు ఉచ్ఛరిస్తున్నాడు. వాటి అర్థం తెలుసుకునేందుకు మేమంతా కుతూహలంగా ఉన్నాం, అయితే అతడు నోరు తెరచి మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే జీవించి ఉండగలడు. తమరు దయతో ఏదైనా ఒక మహా శక్తివంతమైన ఔషధాన్ని ఇచ్చి కొంచెం మాట్లాడేటట్లు చేశారా, మీ ఋణం మేం తీర్చుకోలేం’’ అంటూ ప్రాధేయపడ్డారు.
దీంతో వైద్యుడు తన సరంజామాతో పాటు కొన్ని ఔషధాలను కూడా పట్టుకుని రోగివద్దకు వైద్యుడు చేరుకున్నాడు. రోగిని సమీపించి నాడి పరీక్షించి ఇంకా స్పృహ ఉందని చెప్పి ఓ మహత్తరమైన ఫలితాన్ని కలుగచేసే సూదిమందును వేశాడు వైద్యుడు. వెంటనే సూదిమందు ఫలితం చూపడంతో రోగి కదలడం ప్రారంభించాడు.
ఇదే అదనుగా తలచిన బంధువులంతా ‘‘బావగారూ... మామగారూ... నాన్నగారూ...అన్నయ్యగారూ...మీరు పలికిన క, క, క అన్న మంత్రానికి అర్థమేమిటో సెలవివ్వండి అంటూ ప్రార్థించారు. వారి అభ్యర్థనను అర్థం చేసుకున్న రోగి ‘‘కరు కసబరి కెయన్ను కడియుత్తదె’’ అని తాను ఉచ్ఛరించిన బీజాక్షరముల వివరము తెలియచేశాడు. దాని అర్థమేమంటే ‘‘దూడ చీపురుకట్ట తినేస్తున్నది’’ అని. ధనవంతుడు కన్నడ దేశస్థుడు. కాబట్టి కన్నడ భాషలో తానుచ్ఛరించిన మంత్రార్ధాన్ని వివరించాడు.
అందరూ రోగగ్రస్థుడైన అతడికి అంత్యకాలంలో పుణ్యలోక ప్రాప్తి కలుగచేయాలని, ఏ విధంగా అయినా సరే ఒక్కసారయినా భగవన్నామాన్ని స్మరింపచేయాలని తపిస్తున్నప్పటికీ ఇతడు మాత్రం అంత్యకాలంలో కూడా తన ధనాశ పోగొట్టుకోలేదు. దూడ చీపురుకట్ట తినడం వల్ల వచ్చే నష్టంమీదనే అతని దృష్టంతా కేంద్రీకరించాడు.
తన ధనమునకు నష్టము లేదా తన సంపదకు నష్టం వచ్చుచున్నదన్న బెంగే తప్ప తాను తన భార్యా బిడ్డలను వదిలిపోతున్నానన్న బాధగాని, ఈ సకల సంపదలను, భోగభాగ్యాలను వదిలిపోతున్నానన్న చింతగాని లేని ఈ నిర్భాగ్యుడు ఒక చిన్న చీపురుకట్ట పోతోందన్న బెంగనే వెలిబుచ్చడం పట్ల బంధుమిత్ర పరివారమంతా విస్తుపోయారు. శాశ్వతమైనది, పుణ్యలోక ప్రాప్తి కలిగించే భగవధ్యానాన్ని వదిలి దేనికీ కొరగాని చిన్న చీపురుకోసం తన జీవితాన్ని నిరర్ధకం చేసుకున్నాడంటూ బంధువులు శోకతప్తహృదయులయ్యారు.
‘‘తస్మాత్ సర్వకార్యేషు కాలేషు మామనుస్మరా’’ అని భగవంతుడు పలికినట్లు జీవితంలో సర్వకాల సర్వావస్థల్లో భగవంతుని నామస్మరణను వీడనివారు అంత్యకాలంలో నిర్మల మనస్సుతో భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు. భగవంతుని ధ్యానంలో ప్రతి ఘడియా కీలకమైనదే. కాబట్టి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతీ ఘడియలోను సాధ్యమైనంత వరకూ పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. ఇదే భగవత్ప్రీతికరం కూడా.