పురాణగాధ
ధృవుని తల్లి సునీత. అయితే ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుడు సింహాసనము ఎక్కకుండా తంత్రాలు నడుపుతోంది. ధృవుని పిలిచి ‘‘నాయనా! నీవు సింహాసనము అధిష్టించి, రాజ్యపాలన చేయాలంటే తపస్సుచేసి నా కడుపున పుట్టాలి’’ అని చెబుతుంది. దానికి ధృవుడు బాధపడి పౌరుషంతో అడవికి బయలుదేరుతాడు. పూర్వకాలములో ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా కీకారణ్యము.
ధృవుడు ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉండేది. ఈ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూసి ఆ ముని ధృవుని మనస్సులోని కోరికను తెలుసుకున్నవాడై‘‘నాయనా! విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళరూపమును తలచుకుంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు’’ అని చెప్పారు. మునీశ్వరులు చెప్పినట్లుగా ధృవుడు తపమాచరించడం మొదలుపెట్టాడు.
అలా కొంతకాలం గడచిన తరువాత ధృవుని తపస్సుకు మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసిన ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు ‘‘బాలకా! భయమెందుకు? తత్తరపాటు చెందకు. నేను నీయంతే ఉన్నాను’’ అని నవ్వుతూ పలుకుటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయములేకుండా చేసి స్వామివారు అక్కడ శిలారూపములో వెలసినట్లు స్థలపురాణము ద్వారా తెలుస్తోంది.
ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచారు. ‘‘నీ అంతే ఉన్నాను కదా’’ అని చెప్పినందున, చూసేవాళ్ళు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు ఉన్నట్లుగా స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. స్వామి చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు, ఎడమ కుడులకు ఉంటాయి. ఈ స్వామి అలంకారప్రియుడు కూడాను.
స్వామివారు వెలసిన తరువాత కొంతకాలమునకు ఎండకు ఎండి, వానకు తడిసి ఉన్నారు. అంతట దేవతలు ముందుకు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణము చేశారు. తరువాత లక్ష్మీదేవిని నారదమునీశ్వరులు, ఈ యుగములో శ్రీకృష్ణదేవరాయలవారు భూదేవి అమ్మవారి తామ్రవిగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా శిలాశాసనములు చెప్తున్నాయి. విష్ణుమూర్తి శిలారూపములో ఇక్కడే మొదటిసారిగా వలసినందున ఈ తిరుపతిని ‘‘తొలితిరుపతి’’ అని కూడా పిలుస్తారు.
భోజ మహారాజు, భట్టి విక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ శృంగారవల్లభ స్వామిని దర్శించుకున్నవారిలో కొందరు. విక్టోరియా మహారాణితో పాటు వచ్చిన వ్యక్తికి స్వామివారు ఆరడుగుల ఎత్తుగా దర్శనమిచ్చారని చెబుతారు. విక్టోరియా మహారాణి స్వామివారికి వెండి కవచము చేయించినట్లూ, భోజమహారాజు ఆలయానికి రంగులు వేయించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణములో శివాలయము, విష్ణ్వాలయము రెండూ కూడా ఉన్నాయి. పిఠాపురం దగ్గర గల లక్ష్మీ నరసాపురం రాజులు 600 ఎకరాల భూమిని ఈ దేవాలయమునకు దానంగా ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మాత్రం మిగిలి ఉంది. ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి.
స్వామివారి కళ్యాణం
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం శోభాయమానంగా జరుగుతుంది. చుట్టుపక్కల చాలా గ్రామాల నుండి భక్తులు ఈ కళ్యాణమునకు తరలివచ్చి తిలకించి తరిస్తారు. ధనుర్మాసం నెలరోజులూ కూడా ఈ ఆలయములో ధనస్సు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవముగా జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పులిహోర, దద్ధోజనం, చక్రపొంగలి స్వామివారికి నివేదించి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేస్తారు. ఈ ధనుర్మాసములో చాలామంది భక్తులు తమ గోత్రనామములతో పూజలు జరిపించుకుంటారు.
తరతరాలుగా క్రమం తప్పకుండా వైఖానస అర్చకులు, వైఖానస ఆగమోక్తంగా అర్చనాదులు నిర్వర్తిస్తూ స్వామివారి సేవలతో తరిస్తూ దేవాలయ ప్రశస్తిని, ప్రతిష్ఠను ఇనుమడింపచేస్తున్నారు. ఈ దేవస్థానాన్ని దర్శించినవారు శ్రీ శృంగారవల్లభ స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాము.