దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే అనంగ త్రయోదశి వ్రతం

భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే వ్రతం “అనంగ త్రయోదశి” వ్రతం. చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశినాడు ఈ అనంగ త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. అనంగ త్రయోదశిని మదన త్రయోదశి అని, మన్మద త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ప్రేమాధిదేవత, కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినమే అనంగ త్రయోదశి వ్రత దినం. అనంగ త్రయోదశి రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలి.

వ్రతం ఇలా చేయాలి


అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి, కాల కృత్యాలు తీర్చుకొని తల స్నానం చేసి, నిత్య పూజావిధులను పూర్తి చేసి మన్మధుని పూజించాలి. రతీ మన్మధులతో పాటు కామసంహార మూర్తి అయిన శివుని కూడా పూజించాలి. మన్మధుని చిత్రపటాన్ని గాని, మన్మద సాలగ్రామాన్ని గాని, పసుపుతో చేసిన ప్రతిమను గాని మందిరంలో ఉంచి దానికి షోడషోపచారాలతో పూజించాలి. ధూప, దీప, నైవేద్యాదులతో వ్రత పూజ ముగించుకుని మన్మథునికి, శివునికి గల సంబంధం వివరించే కథను చదువుకోవాలి.

manmadhudu

అనంగుని కథ


మత్స్య, శివ పురాణాల్లో తెలపబడిన వివరాల ప్రకారం...

మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ఉంటుంది. మన్మధుని విల్లు చెఱుకు గడతోను, బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి. ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య రతీదేవి.

ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొంటున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడిని చేయమని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివుని పైకి తన పూల బాణం సంధించి మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.

మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అయితే అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుని భస్మీపటలం చేశాడు.

దీంతో మన్మధుని భార్య రతీదేవి బోరున విలపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. కరుణించిన పరమేశ్వరుడు రతీదేవికి మాత్రమే ఆనాటి నుంచి అనంగుడుగా మన్మధుడు కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని తెలిపి పునరుజ్జీవితుని చేస్తాడు. అనంగుడు అంటే ఎటువంటి అంగాలు లేనివాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. మన్మధునే కాముడు అని అంటారు.

రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ప్రసాదించిన రోజే 'అనంగ'త్రయోదశి. అందుకే ఈ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. రతీ మన్మధులు ఇద్దరూ అన్యోన్యతా అనురాగాలున్న దంపతులు, అలాంటి వారిని పూజించటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయమవుతుంది. ఇదే అనంగ త్రయోదశి వ్రత పరమార్థం కూడా.